సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించడానికి అధికారుల కృషే కారణమని డీజీపీ ప్రసాదరావు కొనియాడారు. పోలీసు విభాగంపై ప్రచురించిన రెండు పుస్తకాలను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వీటికి తుదిరూపం ఇవ్వడానికి మాజీ ఐపీఎస్ అధికారి ఎస్.ఉమాపతి, మాజీ అదనపు ఎస్పీ కె.సుధాకర్ ఎంతో కృషి చేశారని డీజీపీ ప్రసంశించారు. ‘గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ఏపీ పోలీసు’ పేరుతో తీసుకొచ్చిన పుస్తకంలో సైబరాబాద్, మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి అనుసరించిన విధానాల గురించి వివరించారు. ‘ప్రాజెక్ట్-పీపుల్స్ పోలీసింగ్’ పేరుతో ఉన్న పుస్తకంలో ప్రజలతో స్నేహ భావంతో మెలిగేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పేర్కొన్నారు.
అలాగే, ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసు విభాగం జారీ చేసిన మెమోలు, మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను పొందుపరిచారు. ఈ పుస్తకాలను బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రచురించింది.