కంకిపాడు : పాఠశాల క్రీడా మైదానంలో సహచరుడితో ఆడుకుంటున్న ఓ విద్యార్థి ఆదమరుపుగా ఉండి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీ గను తాకి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం..
తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రా మానికి చెందిన దండు పునీత్(15) కంకిపాడు సెయిట్ మేరీస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడి తల్లి అరుణకుమారి తీవ్ర అనారోగ్యంతో 20 రోజుల కిందటే మృతి చెందింది. తండ్రి ప్రసాద్ కుటుంబానికి దూ రంగా ఉంటున్నారు. దీంతో పునీత్ తన మేనమామ వర్రె చిట్టి వెంకటేశ్వరరావు వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన పునీత్.. ట్యూషన్ అయ్యాక టిఫి న్ చేసే సమయంలో ఆట స్థలంలో క్రికెట్ బం తితో సహ విద్యార్థి ఎన్.అరవింద్‌తో కలిసి క్యాచ్‌లు ఆడుతున్నాడు.
ఆటస్థలం, పంట పొ లానికి మధ్యగా వెళ్తున్న విద్యుత్ లైను తీగల్లో ఒకటి నేలకు కేవలం మూడు అడుగుల ఎత్తులో వేలాడుతోంది. పునీత్ ఆట ధ్యాసలో ఉండి పొరపాటున దానిని తాకాడు. అతడు షాక్‌కు గురై కొట్టుకోవడాన్ని సహ విద్యార్థి అరవింద్ చూసి కర్రతో కొట్టి కాపాడేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. పాఠశాల నిర్వాహకులు పునీత్‌ను సమీపంలోని ఆరోగ్యమాత ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
మృతదేహాన్ని సందర్శించిన నేతలు
విద్యార్థి మృతి గురించి సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, డీఈవో డి.దేవానందరెడ్డి, ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసా ద్ ఘటనాస్థలికి వచ్చారు. ఈ ప్రమాదం గురిం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ, పాఠశాల యాజమాన్యం, ఆస్పత్రి సిబ్బం ది నిర్లక్ష్యంపై పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు.
ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్
పాఠశాలలో జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రిన్సిపాల్ సిస్టర్ గ్రేస్‌లెట్, పీఈటీ మాణిక్యంను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో దేవానందరెడ్డి ప్రకటించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయమై షోకాజ్ నోటీసు జారీ చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని డీఈవో తెలిపారు. కంకిపాడు సీఐ రవికుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి చనిపోయిన నెలరోజుల లోపే కుమారుడు ఆమె చెంతకు చేరుకున్నాడంటూ స్థానికులు కంట తడి పెట్టారు.
విద్యార్థి ప్రాణం బలిగొన్న కరెంటు తీగ
Published Sun, Aug 17 2014 2:41 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement