మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు
గొబ్బూరు (పెద్దారవీడు): గుంపులుగా ఉన్న మేకలను ఇంటికి తోలుతున్న సమయంలో బెదిరి పోవడంతో వాటిని చూసేందుకు విద్యుత్ టవర్ పెద్ద లైన్ స్తంభం ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని గొబ్బూరు తిరుమనాథస్వామి మాన్యంలో శనివారం జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన నలుగురు మేకలు మేపుకునేందుకు వాటిని పొలాల్లోకి తోలుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా అవి బెదిరిపోయాయి. కొన్ని మేకలు కనిపించలేదు. చెట్ల చాటుకు వెళ్లి ఉంటాయని భావించి మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి తోకపల్లె గ్రామం వైపు వెళ్లే 30 కేవీ లైన్ విద్యుత్ టవర్‌పైకి కుందురు నాగార్జున, కుందురు శ్రీను ఎక్కారు.
తీగలను గమనించకుండా పైకి వెళ్తున్న సమయంలో తీగలకు కొద్ది దూరంలో ఉండగానే పవర్ లాక్కోవడంతో కుందురు నాగర్జున (20) అక్కడికక్కడే మృతి చెంది కిందపడ్డాడు. కుందురు శ్రీను టవర్ ఎక్కుతూ సగానికి పోగానే ఇనుపరాడ్‌కు చెయి తగలడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. అక్కడే ఉన్న మరో ఇద్దరు గాయాలైన శ్రీనును వెంటనే మార్కాపురం వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లారు. చేతికంది వచ్చిన కుమారుడు మృతి చెందడంతో తండ్రి నరసింహాలు, తల్లి అంకమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment