సీమాంధ్రలో విద్యుత్ కష్టాలు | Electrical difficulties in Simandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో విద్యుత్ కష్టాలు

Published Sun, Oct 6 2013 8:39 PM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM

Electrical difficulties in Simandhra

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర  ప్రాంత విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో సీమాంధ్ర అంతటా చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ లేకపోతే పరిస్థితి ఏమిటో అధికారులకు,  ప్రజలకు అర్ధమైపోయింది. అనేక  రైళ్లు రద్దయిపోయాయి. ఇళ్లలో తడుముకోవలసిన పరిస్థితి. టీవిలు పనిచేయడంలేదు. నీటి సరఫరా బంద్ అయిపోయింది. ఆస్పత్రులలో రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఆ ప్రభావం హైదరాబాద్పై కూడా పడింది. ఇక్కడ కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి.  మొత్తం 30 వేల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాట్లు  సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విశాఖ జిల్లా  సీలేరు, డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రాలవద్ద జేఏసీ ఏర్పాటు చేశారు.  జెన్‌కో సిబ్బంది సమ్మెకు సిద్ధమైంది.  పీలేరు జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం సిబ్బంది రేపు ఉదయం 6 గంటల నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు. వారు సమ్మె చేస్తే  240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది.

ఆర్టీపీపీ, విజయవాడ వీటీపీఎస్‌, శ్రీశైలంలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సదరన్‌ గ్రిడ్‌ దాదాపు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. మిగతారాష్ట్రాల్లోనూ విద్యుత్‌ ఇబ్బందులు తలెత్తుతాయి. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల్లో కూడా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
రేపు ఉదయం నుంచి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది.

తిరుమల శ్రీవారికి కూడా విద్యుత్ కోతల బాధలు తప్పలేదు. శ్రీవారి సన్నిధిలో కూడా చీకట్లు కమ్ముకున్నాయి. కరెంట్ లేకపోవడంతో విద్యుత్ దీపాలంకరణ నిలిపివేశారు.   బ్రహ్మోత్సవాల నేపథ్యంలో  విద్యుత్ జేఏసీ నేతలతో టీటీడీ అధికారులు చర్చలు జరిపారు. తిరుమలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వీఐపీ కాటేజీలు, ప్రధానాలయంకు మినహాయింపు ఇవ్వాలని అడిగారు.

అనంతపురం  జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, అంధకారంలో పల్లెలు, పట్టణాలు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ  వైద్య సేవలు నిలిచిపోయాయి.  వైఎస్ఆర్ జిల్లాలో  విద్యుత్ ఉద్యోగులతో కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాత్రి పూట కూడా విద్యుత్ పునరుద్ధరణకు ఉద్యోగులు నిరాకరించారు. గుంటూరు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక ఆస్పత్రులలో రోగులు అల్లాడుతున్నారు.

రైల్వే శాఖ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
* తిరుపతి - గూడూర్‌ - రేణి గుంట సెక్షన్ల మధ్య7 ప్యాసెంజర్‌ రైళ్లు రద్దు చేశారు.
* కాజీపేట్‌-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతిసెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేశారు.
* తిరుపతి - సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచిగూడ మీదుగా మళ్లించారు.  * తిరుపతి - సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచిగూడ మీదుగా మళ్లించారు.  

* తిరుపతి- నెల్లూరు‌, నెల్లూరు-చెన్నై ప్యాసింజర్లు, చెన్నై- నెల్లూరు, నెల్లూరు - తిరుపతి ప్యాసింజర్లు పాక్షికంగా రద్దు చేశారు.
* చెన్నైనుంచి రావాల్సిన పినాకిని ఎక్స్‌ ప్రెస్‌ రద్దు
* విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రద్దు
* చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రద్దు
* విజయవాడ- బిట్రగుంట ప్యాసింజర్‌ రద్దు
* బిట్రగుంట- విజయవాడ ప్యాసింజర్‌ రద్దు
* బిట్రగుంట - చెన్నై ప్యాసింజర్‌ రద్దు
* చెన్నై - బిట్ర గుంట ప్యాసింజర్‌ రద్దు
* చెన్నై-గూడూరు ప్యాసింజర్‌ రద్దు
ఇంకా మరిన్ని రైళ్లు రద్దయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement