తిరుమలకు నడపనున్న ఎలక్ట్రికల్ బస్సు (ఫైల్)
చిత్తూరు, తిరుపతి సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యల వేగవంతంలో భాగంగా తిరుపతి–తిరుమల మధ్య విద్యుత్ బస్సులను నడిపేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తయిన నేపథ్యంలో ఇటీవల విద్యుత్ బస్సులను తిరుమలకు ప్రయోగాత్మక పరిశీలన చేశారు. అది పూర్తిగా విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో విద్యుత్ బస్సులను తెప్పించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మరో ఆరు నెలల్లో తిరుపతికి 100 విద్యుత్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బస్సుల రాకతో ప్రస్తుతం తిరుపతి–తిరుమల మధ్య వెచ్చిస్తున్న రూ.కోటి ఇంధనం వ్యయం ఆదా అవడంతోపాటు యాత్రికులకు కాలుష్య రహిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఆర్టీసీ అధికారులు అన్ని కసరత్తులు పూర్తి చేసి సుముఖంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు సైతం సానుకూలత ప్రదర్శిస్తున్నారు. అందుకోసం మూడు రోజుల క్రితం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆపరేషన్ ఈడీ రామకృష్ణ, ఇతర అధికారులు, ఎలక్ట్రికల్ బస్సు కంపెనీల ప్రతినిధులు వచ్చి అలిపిరి డిపో, మంగళం డిపోల్లో ఎలక్ట్రికల్ బస్సుల పార్కింగ్ కోసం స్థల పరిశీలన చేసి వెళ్లారు.
పర్యావరణ హితమే లక్ష్యం
తిరుమలలో ఆధ్యాత్మికతతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. మూడు నెలల క్రితం గోల్డ్ స్టోన్, అశోక్‌లేలాండ్ లాంటి కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపి పరిశీలించారు. ఎలక్ట్రికల్ బస్సులను నడపటం వల్ల శబ్ధ కాలుష్యం, పొగ కాలుష్యం లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదంగా ప్రయాణాన్ని అందించవచ్చు. ఒక్కొక్క బస్సు రూ. 2 కోట్లకు పైగా విలువ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం తిరుపతి–తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వేగవంతంగా ప్రతిపాదనలు పూర్తి చేయాలని ఆర్టీసీ యాజమాన్యం కూడా కిందిస్థాయి అధికారులకు అదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 100 విద్యుత్ బస్సుల పార్కింగ్, ఇతర వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.
అలిపిరి డిపో పార్కింగ్‌కు అనుకూలం
మంగళం డిపో, అలిపిరి డిపోల్లో ఉన్న ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీ ఈడీతోపాటు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డిపో మేనేజర్లు మూడు రోజుల క్రితం పరిశీలించారు. అలిపిరి డిపోలో బస్సుల పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ప్రతిపాదనలకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. అదే మంగళం డిపో అయితే రోజు ఎలక్ట్రికల్ బస్సులు బస్టాండుకు రావడానికి, పోవడానికి సుమారు 25 కిలోమీటర్లు మేర ఖర్చు, సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. ఒక్కమారు మూడు గంటల పాటు బస్సుకు చార్జింగ్ పెడితే తిరుపతి– తిరుమల మధ్య 4 ట్రిప్పులు తిప్పే అవకాశం వుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మంగళంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తే మూడు ట్రిప్పులు మాత్రమే నడిపే అవకాశం ఉండడంతో అలిపిరి డిపోను ఎంపిక చేసినట్లు సమాచారం.
99 సంవత్సరాల లీజుకు ఇస్తే
ఇప్పటికే టాటా క్యాన్సర్ హాస్పిటల్, వెటర్నరీ యూనివర్సిటీ, భారతీ విద్యాభవన్ తదితర సంస్థలకు టీటీడీ స్థలాలను 99 సంవత్సరాల లీజు కు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ లెక్కన నెలకు నామమాత్రపు అద్దె రూ.1000 చొప్పున టీటీడీ కి ఆయా సంస్థలు అద్దె రూపంలో చెల్లిస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీకి కూడా టీటీడీ స్థలాలు, భవనాలు నామమాత్రపు అద్దెకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు పంపించే ఆలోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment