శోభాయమానం పరిణయోత్సవ మండపం | Tirumala Venkateswara Temple | Sakshi
Sakshi News home page

శోభాయమానం పరిణయోత్సవ మండపం

Published Fri, May 9 2014 2:31 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

శోభాయమానం పరిణయోత్సవ మండపం - Sakshi

శోభాయమానం పరిణయోత్సవ మండపం

  •   పసుపు, కుంకుమ మండపం ఈ ఏడాది ప్రత్యేకం
  •   విశేషంగా ఆకట్టుకున్న బాణసంచా వెలుగులు
  •  తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన పద్మావతి పరిణయోత్సవ మండపం చూపురులకు కనువిందు చేసింది. ప్రతి ఏడాది సాలకట్ల పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యానవన శాఖ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక అలంకరణలు చేశారు.

    రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పరిణయ మండపం ముఖద్వారాన్ని ఇరువైపుల స్తంభాలపై బంగారు వన్నె కిరీటాలతో ఏర్పాటు చేశారు. గత ఏడాది పరిణయ మండపాన్ని గాజుదీపాలతో, క్రిస్టల్స్‌తో అలంకరిస్తే ఈ ఏడాది వినూత్నంగా గాజు గిన్నెల్లో పసుపు-కుంకుమ వేరువేరుగా ఉంచి, మధ్య మధ్యలో విభిన్న రంగులతో కూడిన మట్టిగాజులను వేలాడదీసి అందంగా అలంకరించారు.

    మలయప్పస్వామి ఉభయనాంచారులతో కలిసి వేంచేపు చేసే ఊంజల్ మండపాన్ని బత్తాయి, అనాస పండ్లతో అలంకరించారు. అలాగే చిన్నారి కృష్ణుని లీలావినోదాలు తెలియజేసే 50కి పైగా బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నారాయణ గిరి ఉద్యానవనం మొత్తం వివిధ దేవతామూర్తుల భారీ విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో మండపం మొత్తం సుందరంగా తయారైంది.

    సాయంత్రం వేళలో, చల్లని వాతావరణంలో స్వామివారి ఉత్సవర్లను చూస్తూ భక్తులు ఉత్సాహంగా గడిపారు. తొలి రోజు ఉత్సవంలో భాగంగా చివరలో పేల్చిన బాణసంచా వెలుగులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా మండ పాన్ని అలంకరించేందుకు పూణేకు చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్టు వారు రూ.15 లక్షలు టీటీడీకి విరాళంగా ఇచ్చారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement