డిస్కమ్‌లకు ‘అర’కొర..
- కోరిన సబ్సిడీ రూ. 6822 కోట్లు
- ఇచ్చింది మాత్రం రూ. 3300 కోట్లు
- ప్రజలపై భారీగా చార్జీల మోత
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలకు బడ్జెట్‌లో సర్కారు మొండిచేయి చూపింది. ఫలితంగా భారీగా విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీనివల్ల 2017–18లో రూ. 7,922 కోట్ల మేర ఆర్థిక లోటు ఏర్పడుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. విద్యుత్ చార్జీల రూపంలో రూ. 1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. మిగిలిన రూ. 6,822 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి.
అయితే తాజా బడ్జెట్‌లో కేవలం రూ. 3,300 కోట్లు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంది. దీనివల్ల డిస్కమ్‌లు మరో రూ. 4,622 కోట్లు (రూ. 3522 కోట్లు +రూ. 1100 కోట్లు) సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వం సబ్సిడీలో భారీగా కోత పెట్టడం వల్ల ప్రజలపై ఆ మేరకు భారం వేయకతప్పదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మిగులులో కేవలం 2 వేల మిలియన్ యూనిట్లు మాత్రమే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీకి తెలిపాయి.
మిగలిన 8 వేల మిలియన్ యూనిట్లను ఏపీ జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయడమే మార్గమని పేర్కొన్నాయి. కొనుగోలు విద్యుత్ వల్ల యూనిట్ ధర గరిష్టంగా రూ. 5లు ఉంటుందని, ఇవన్నీ ఆర్థిక లోటు పెరగడానికి కారణాలుగా డిస్కమ్‌లు చెబుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఇప్పటికే విద్యుత్« ధర యూనిట్ రూ. 2లోపే ఉంది. ఈ కారణంగా కొన్ని పరిశ్రమలు, రైల్వే విభాగం ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లాయి. ఈ రకంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సబ్సిడీ భారం ఆశించినంత ఇవ్వకపోవడంతో ప్రజలపై భారం పడే వీలుంది.
సర్కారుది మోసమే: వేణుగోపాల్ రావు
విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 3,300 కోట్ల సబ్సిడీనే బడ్జెట్‌లో కేటాయించడం దారుణమని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాల రావు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై భారీగా విద్యుత్ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒత్తిడి చేసిందని, అయినవారి జేబులు నింపడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని ఆయన అన్నారు. పెద్దలకు దోచిపెట్టి, పేదలపై భారం మోపే ప్రభుత్వ ప్రయత్నం మోసపూరితమని ఆయన విమర్శించారు.