= కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
=నలుగురు దుర్మరణం
=రక్తసిక్తమైన బస్టాప్
సాక్షి, విజయవాడ : విధి వారి జీవితాలతో చెలగాటం ఆడింది. అప్పటివరకు చదువుకుని ఇంకో గంటలో ఇంటికి వెళ్లడానికి బస్టాప్‌లో ఎదురు చూస్తున్న ముగ్గురు విద్యార్థినులను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వివాహ బంధంలోకి వచ్చి మూడు నెలలు కూడా దాటని మరో వైద్యుడిని కూడా కబళించింది. డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేని ఫుట్‌వేర్ కంపెనీ ఉద్యోగి నడుపుతున్న కారు బస్టాప్‌లోకి దూసుకొచ్చి నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. త్వరగా విమానాశ్రయానికి చేరాలన్న ఆదుర్దాలో బీపీ డౌన్ అయి ఒక్కసారిగా కారు అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
అది విజయవాడ రామవరప్పాడు రింగ్ సెంటర్. సాయంత్రం ఐదు కావస్తోంది. సమీపంలోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాల అప్పుడే వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్దకు వచ్చి బస్టాప్‌లో నిలుచున్నారు. పిన్నమనేని వైద్యకళాశాల కూడా అప్పుడే వదిలిపెట్టారు. అందులోని డాక్టర్లు, విద్యార్థులు కూడా బయటకు వచ్చారు. ఇలా అక్కడ కోలాహలం నెలకొంది. బస్టాప్‌లో ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు, డాక్టర్లు, ఇతర ప్రయాణికులు నిలుచుని ఉన్నారు. చాలా సురక్షిత ప్రాంతంలోనే ఉన్నా మృత్యువు వారిపైకి కారు రూపంలో దూసుకొచ్చింది.
గుంపుగా బస్టాప్ వద్ద నిలుచున్నవారిని వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. తేరుకునేసరికి 15 మందికి పైగా గాయాలతో కిందపడిపోయారు. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోతిర్మయి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన మరో పదిమందిని అక్కడే ఉన్న పోలీసులు, సమీపంలోని వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చందుశ్రీ, సింధుజ అనే మరో ఇద్దరు విద్యార్థినులు మారుతి సురేష్ అనే వైద్యుడు కన్నుమూశారు.
కుటుంబాల్లో తీరని శోకం...
ఊహించని దుర్ఘటనలో నలుగురు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు కాగా, మరొకరు పిన్నమనేనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ మారుతి సురే ష్. ఆయన ఏడాదిన్నర క్రితమే ఎండీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరారు. మూడు నెలల క్రితమే (గత ఆగస్టులో) పెళ్లయింది. ఆయన భార్య కూడా దంత వైద్య నిపుణురాలు. ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ‘నా కుమారుడిని ఉదయమే బస్టాప్‌లో దింపా.. వెళ్లొస్తా నాన్నా అన్నాడు.. కానీ రాకుండానే వెళ్లిపోయాడు..’ అంటూ సురేష్ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు.
మృతుల్లో టి.జ్యోతిర్మయి స్వస్థలం నున్న. తండ్రి శివశంకర్ ఎలక్ట్రీషియన్. దాసరి చందుశ్రీ (20) స్వస్థలం కూడా నున్న గ్రామమే. మరో విద్యార్థిని పెసల సింధూజ (20) స్వస్థలం న్యూరాజీవ్‌నగర్ ప్రాంతం. తండ్రి జనార్ధన్ ఆటోడ్రైవర్. మృతుల బంధువులు, ఆప్తుల రోదనలతో ప్రభుత్వాస్పత్రితో పాటు, సెంటినీ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని వందలాది మంది ప్రభుత్వాస్పత్రి, సెంటినీ ఆస్పత్రుల వద్దకు చేరుకున్నారు.
దీంతో ఆయా ఆస్పత్రుల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే డీసీపీ రవిప్రకాష్ విద్యార్థినులు చికిత్స పొందుతున్న సెంటినీ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందనలు ఆస్పత్రికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించారు.