ఉద్యోగుల ఉగ్రరూపం | Employees Rally on CPS Ban Demand Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఉగ్రరూపం

Published Mon, Mar 4 2019 6:41 AM | Last Updated on Mon, Mar 4 2019 6:41 AM

Employees Rally on CPS Ban Demand Visakhapatnam - Sakshi

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల గేటు నుంచి ర్యాలీగా వస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులు

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేయాలంటూ ఉద్యోగులు కదంతొక్కారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, చొక్కాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు చేసేంత వరకూ పోరాటం చేయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు. పెన్షన్‌ భిక్ష కాదు అని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు?ను పాలకులు విస్మరించడం బాధాకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విశాఖ సిటీ: సీపీఎస్‌.. ప్రస్తుతం రాష్ట్రంలోని 2 లక్షల మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రైవేటు సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్‌ పెన్షన్‌ స్కీమ్‌ అంటూ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించని సీపీఎస్‌ తమకొద్దంటూ నినదిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఐదు జిల్లాలకు చెందిన సీపీఎస్‌ ఉద్యోగులు నగరంలో ఆందోళన నిర్వహించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి దారిపొడవునా సీపీఎస్‌ విధానానికి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమై సీపీఎస్‌ రద్దు చేసేంత వరకూ పోరాటం చెయ్యడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని తీర్మానించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గంట శ్రీనివాసరావు, సంతోష్‌కుమార్‌ బెహరా, సతీష్, మక్కా సురేష్, రెడ్డి సూరిబాబు, డా.సాంబమూర్తి, డా.సుబ్రహ్మణ్యం, ప్రొ.జానకిరామ్, శేఖర్‌బాబుతో పాటు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీపీఎస్‌ ప్రకటన జరిగిందిలా
సీపీఎస్‌ విధానంపై 2003 డిసెంబర్‌ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004 జనవరి 1 నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఉద్యోగులందరికీ జీవో నంబరు 653, 654,655 కింద 2004, నవంబర్‌22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

అమలు తీరు..
సీపీఎస్‌ విధానంలో టైర్‌1, టైర్‌2 అనే రెండు రకాల ఖాతాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయులకు టైర్‌ 1 ఖాతాలు మాత్రమే అమలు చేస్తున్నారు. టైర్‌–2లో ఎప్పుడైనా డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. తన పొదుపుని తనకు నచ్చిన సంస్థల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం టైర్‌–2ని అమలు చెయడం లేదు. ఉద్యోగి చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటాను జమ చేయగా వచ్చిన మొత్తంలో ఉద్యోగ విరమణ చేశాక 60 శాతం మాత్రమే సదరు ఉద్యోగికి చెల్లిస్తారు. అందులోనూ 30 శాతానికిపైగా వివిధ రకాల పన్నులు, ఛార్జీల రూపేణా మినహాయించేస్తారు. మిగిలిన 40 శాతం యాన్యుటీ పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బాండ్ల నుంచి వచ్చే డబ్బును ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నెలలా పెన్షన్‌గా 70 ఏళ్ల వరకూ చెల్లిస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బు మొత్తం ఆదాయపు పన్ను మినహాయించుకుని ఇస్తారు.

నిర్ణయం రాష్ట్ర పరిధిలోనే
సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమాలే జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినందు వల్ల దీన్ని రద్దు చెయ్యలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమ బంగా మొదలైన రాష్ట్రాల్లో ఇంకా పాత పెన్షన్‌ విధానమే అమల్లో ఉంది. కొంతమంది ఉద్యోగులు సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. వెంటనే సీపీఎస్‌ రద్దు చెయ్యాలని నెలల తరబడి ఉద్యమాలు, ఆందోళనలు, ఆమరణ దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కించుకోకపోవడం గర్హనీయమని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్‌ రద్దు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

లోపాలే.. ఉద్యోగుల పాలిట శాపాలు
30 నుంచి 35 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసి రిటైర్మెంట్‌ అయితే ఆసరాగా ఉండాల్సిన పింఛను ఎంత వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.
ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే సీపీఎస్‌ అకౌంట్‌లో జమ అయిన డçబ్బులు తిరిగి వచ్చే అవకాశం కష్టం.
ఫండ్‌ మేనేజర్స్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చందాదారులైన ఉద్యోగులకు లేకపోవడం గమనార్హం.
ఉద్యోగి తన సర్వీస్‌ కాలంలో 25 శాతం మాత్రమే విత్‌ డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. అది కూడా పదేళ్ల సర్వీస్‌ పూర్తయితేనే. ఉద్యోగ కాలంలో మూడు సార్లకు మించి అవకాశం లేదు. ప్రతి రెండు విత్‌డ్రాలకు మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాల్సిందే. విత్‌డ్రాలు కూడా ప్రత్యేక అవసరాలకు మాత్రమే.

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు అంశం రాష్ట్రం చేతిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేను.
– బాధ్యత గల ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలివి

సీపీఎస్‌ రద్దు అంశం ఉద్యోగుల ప్రాథమిక హక్కు. ఆర్థిక భారమే అయినా ఉద్యోగులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. సీపీఎస్‌ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తాం– ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేతవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement