ముగిసిన ‘ఓటు’ గడువు
Published Tue, Dec 24 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
సాక్షి, కాకినాడ : సామాన్యుల చేతిలో పాశుపతాస్త్రమైన ‘ఓటు’ హక్కు కోసం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజకీయంగా రానున్న కాలంలో చోటు చేసుకోనున్న సమూల మార్పులకు ఇదొక శుభపరిణామం. కొత్త నాయకత్వాన్ని..సరికొత్త రాజకీయాలను సామాన్యులు సైతం కోరుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడం చదువుకున్న వారు, మేధావుల్లో కూడా ఓటు హక్కుపై ఆసక్తి పెరిగినట్టు కన్పిస్తుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తని కనబర్చారు. 2014లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న ఓటర్ల నమోదుకు జిల్లాలో ఊహించని రీతిలో స్పందన లభించింది.
జిల్లాలో 18ఏళ్లకు పైబడిన నవ యువఓటర్లు జిల్లా జనాభా నిష్పత్తిని బట్టి 1,42,666 మంది ఉన్నారని అంచనా వేశారు. ఆ మేరకు నమోదైతేనే గొప్ప అని అందరూ భావించారు. ప్రారంభంలో నత్తనడనక సాగిన ఈ ప్రక్రియ ఆతర్వాత ఊపందుకుంది. దీనికి తోడు రెండుసార్లు గడువును కూడా పెంచడం గణనీయంగా ఓటర్ల నమోదుకు దోహదపడింది. జనాభా నిష్పత్తిని బట్టి 1,42,666 మంది మాత్రమే కొత్త ఓటర్లున్నారని అంచనా వేస్తే వాటిని తలకిందులు చేస్తూ ఆదివారం రాత్రికే ఏకంగా జిల్లాలో 1,75,541 మంది ఓటుహక్కు కోసం ఫారం-6లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60 వేల మందికి పైగా తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇక సవరణలకు సంబంధించి ఫారం-7లో 15,256 మంది దరఖాస్తు చేసుకోగా, తమ పేర్లు తొలగించాలంటూ ఫారం-8లో 10,479 మంది 2649 మంది, పోలింగ్ స్టేషన్ల మార్పు కోసం ఫారం-8ఏ లో 2575 మంది దరఖాస్తు చేసు కున్నారు.
ఎన్నడూ లేని రీతిలో యువత ఈసారి ఓటర్ల నమోదు పట్ల ఆసక్తిని కనపర్చారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 51,54,296 మంది ఉన్నారు. వీరిలో 34,29,149 మంది ఓటర్లున్నారు. వీరిలో 25,69,688 మంది పురుషులకు 17,13, 958 మంది, 25,84,608 మంది స్త్రీలకు 17,15,089 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. 2014 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు జిల్లాలో ఏకంగా 1,42,666 ఉన్నారని అంచనా వేయగా, ఆదివారం రాత్రి వరకు ఏకంగా 1,75,541 మంది కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50 శాతానికి పైగా యువత ఉండగా, మిగిలిన వారు ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాల కోసం జిల్లాలో స్థిరపడిన వేరే ప్రాంతాలకు
చెందిన వారుగా భావిస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్‌లో 17,735 మంది నమోదు చేసుకోగా, మండపేటలో అత్యల్పంగా 5188 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు నమోదైన ఓటర్ల సంఖ్యను కూడా గణిస్తే కొత్త ఓటర్ల సంఖ్య రెండులక్షలు దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగు రోజులుగా ఆన్‌లైన్ మొరాయించడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల సంఖ్యను కూడా గణించలేదు. ఈ దరఖాస్తుల సంఖ్య కూడా తేలితే కొత్త ఓటర్లు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Advertisement