సాక్షి, న్యూఢిల్లీ: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వరుసగా రెండోరోజూ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈడీ ఆదేశాల మేరకు ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈ.ప్రసాదరెడ్డి మంగళవారం కూడా ఢిల్లీ ఖాన్‌మార్కెట్‌లోని లోక్‌నాయక్ భవన్‌లో ఉన్న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులు వారిద్దరినీ ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సాయిరెడ్డి, ప్రసాదరెడ్డి వివరంగా సమాధానాలిచ్చారు. ఈ కేసులో వారిని సోమవారం కూడా ఆరు గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.
సోమవారం సాయంత్రం విచారణ ముగించే సమయంలో.. మంగళవారం మళ్లీ రావాలని సాయిరెడ్డి, ప్రసాదరెడ్డికి అధికారులు చెప్పారు. ఈ మేరకు వారు ఉదయమే ఈడీ అధికారుల ముందు హాజరుకాగా సోమవారంకన్నా మరింత ఎక్కువగా దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. చివరగా ఇద్దరి నుంచీ స్టేట్‌మెంట్లను నమోదు చేసుకున్నారు. కాగా, ఈడీ అధికారులు చెప్పిన మేరకు సాయిరెడ్డి వచ్చే నెల 6న మళ్లీ విచారణకు హాజరుకానున్నారు. మంగళవారం పూర్తయిన విచారణతో జగన్ సంస్థలకు చెందిన ముఖ్యులను ఈ నెలలోనే 4 సార్లు విచారించినట్టయింది.