సాయికిరణ్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి, బంధువులు
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం): క్యాన్సర్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉందని వైద్యులు చెప్పినప్పటికీ ఆ యువకుడు కుంగిపోలేదు. నాన్నా.. నాకు బతకాలని ఉందని ఆపరేషన్ చేయించండని ప్రాధేయపడ్డాడు. ఆర్థిక స్థోమత అంతగా లేకపోయినా స్నేహితులు, బంధువులు, దాతల సాయంతో అపరేషన్ చేయించారు. క్యాన్సర్ మహమ్మారి ముందు ఆ యువకుడి పోరాటం తలవంచింది. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి చేదుడుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలపై విధి చిన్నచూపు చూసింది. చిన్నప్పుడు కాలుకు తగిలిన గాయం ప్రాణాంతకంగా మారింది. బోన్‌మేరో (క్యాన్సర్) రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబలించింది. ఏడాదిపాటు మృత్యువుతో పోరాడి ఓడిన ఆ యువకుడి మృతి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వీరఘట్టం గ్రామానికి చెందిన గౌరీపతి మహాపాత్రో, గిరిజాకుమారి మహాపాత్రోల కుమారుడు సాయికిరణ్ మహాపాత్రో(22) బోన్‌మేరో క్యాన్సర్‌తో ఆదివారం రాత్రి మృతిచెందారు.
సాయికిరణ్ టెక్కలి ఐతం కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్‌లో మూడో సంవత్సరం చదుతున్న సమయంలో (గతేడాది) కుడి కాలు మోకాలు వద్ద ఉబ్బింది. చదువు జ్యాసలో పడి కాలు గురించి పట్టించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత కాలు బాగా నొప్పిగా అనిపించడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించారు. అక్కడ వైద్యులకు కాలు ఎందుకు ఉబ్బిందో అర్థం కాలేదు. వెంటనే బైయాప్స్(క్యాన్సర్ నిర్థారణ) పరీక్ష చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో బైయాప్స్ పరీక్ష చేయించారు. 12 రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్స్‌లో క్యాన్సర్ తొలి దశలో ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
రెండు నెలల్లోనే మారిన పరిస్థితి..
ఆపరేషన్ పూర్తయిన తర్వాత రెండు నెలలు ఇంటిలోనే ఉం టూ చెలాకీగా కనిపించిన సాయికిరణ్‌కు ఆపరేషన్ జరిగిన చోటకాయ ఏర్పడింది. కాయ మూడు రోజుల్లో మూడింత లు పెరిగింది. వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని వెంటనే వ్యాధి ప్రబలిన కుడి కాలును తొలగించాలని, లేకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు సూచించారు. తన కాలు తీసేసి బతికించండని ప్రాధేయపడ్డాడు. నాలుగు నెలల కిందట కాలు తొలగించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.
ముదిరిన వ్యాధి..
శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. అయినా వ్యాధి తీవ్రత తగ్గలేదు. కాలు నుంచి కాలేయం, గుండెకు క్యాన్సర్ ప్రబలడంతో చివరకు సాయికిరణ్ జీవితంపై ఆశలు వదులుకున్నాడు. ఏడాదిగా మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం రాత్రి తన ఇంటి వద్ద తుది శ్వాస విడిచాడు. సాయికిరణ్ మృతి చెందాడని తెలియడంతో టెక్కలి ఐతం కాళాశాల విద్యార్థులు, తల్లిదండ్రుల మిత్రులు, వీరఘట్టం కనోసా సిస్టర్లు, సిబ్బంది వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
ధైర్యంగా నిలబడ్డాడు..
క్యాన్సర్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉందని వైద్యులు చెప్పినప్పటికీ సాయికిరణ్ కుంగిపోలేదు. నాన్నా.. నాకు బతకాలని ఉందని ఆపరేషన్ చేయించండని ప్రాధేయపడ్డాడు. ఆపరేషన్ చేయించే స్థోమత లేని ఆ కుటుంబానికి టెక్కలి ఐతం కళాశాల సహ విద్యార్థులు, మిత్రులు, బంధువులు, వీరఘట్టం కనోసా సిస్టర్స్‌తో పలువురు అండగా నిలిచారు. ఆపరేషన్‌కు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చారు. విశాఖపట్టణంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, అగనంపూడిలోని టాటా క్యాన్సర్ ఆస్పత్రితోపాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కూడా తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించారు. ఆరు నెలల కిందట హైదరాబాద్ నిమ్స్‌లో శస్త్ర చికిత్స చేయించారు. తర్వాత రెండు నెలలకు సాయికిరణ్ ఆరోగ్యం కుదటపడింది.
Comments
Please login to add a commentAdd a comment