- అవసరం రూ. 2,000 కోట్లు
- బడ్జెట్ కేటాయింపు రూ. 897 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా పేద వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తయే పరిస్థితులు కనబడటంలేదు. బడ్జెట్ కేటాయింపులే అందుకు కారణం. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2.07 లక్షల ఇళ్లు కొత్తగా నిర్మిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పొందుపరచారు. ఇందులో భా గంగానే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు యూనిట్ కాస్ట్‌ను ఒక్కొక్క ఇంటికి రూ. 1.50 లక్షలకు, ఇతర లబ్ధిదారులకు రూ.లక్షకు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.
ఈ లెక్కన అంచనా వేస్తే రూ. 2 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి. పైగా, లబ్ధిదారులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ. 500 కోట్ల మేరకు ఉన్నాయి. కానీ, బడ్జెట్‌లో కేవలం రూ. 897 కోట్లు మాత్రమే కేటాయిం చారు. ఈ మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతాయి. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 808 కోట్లు కేటాయించినప్పటికీ కొత్తగా ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోగా పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేయలేదు. గత ఏడాది కేటాయించిన నిధులు అలాగే మిగిలిఉండగా.. ఈ ఏడాది దానికి రూ. 89 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,56,229 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అధికారం ఇస్తే యూనిట్ ధర పెంచుతానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆయన మాటలు నమ్మి ఓట్లు వేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర నిధులు కేటాయించడం వల్ల నిధులన్నీ సిబ్బంది జీతాలకే సరిపోతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను బట్టి చూస్తే ఈ ఏడాది కూడా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇదేవిధంగా పేదల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బిల్లులు అందక అర్ధంతరంగా ఆగిన ఇళ్లు కూడా శిథిలం అవుతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.