చదువుకు తగ్గ చదివింపులేవి?
- ఇంటర్, కళాశాల విద్య నిధులకు భారీ కోత
- నైపుణ్యాభివృద్ధికి రూ. 360 కోట్లు
- సాంకేతిక విద్యకు తగ్గిన నిధులు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగాన్ని గుణాత్మకంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినా ఈ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అందుకు తగ్గట్టుగా లేవు. పైగా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీగానే కోతపడింది. మానవవనరులను వినియోగించుకోవడం ద్వారా రానున్న కాలంలో రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చె ప్పారు. కానీ నిధుల కేటాయింపులో ఆ ఆశయాన్ని కనబర్చలేకపోయారు.
ఉన్నత విద్యకు మొత్తంగా చూస్తే రూ. 3,049 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయమే రూ. 2,203.29 కోట్లు కాగా ప్రణాళికా వ్యయం రూ. 463.62 కోట్లు మాత్రమే. గత ఏడాదిలో ఉన్నత విద్యకు ప్రణాళికేతర వ్యయం కింద రూ. 2,183.95 కోట్లు కేటాయించగా ఈసారి జీతభత్యాలు ఇతర వేతనాల్లో తేడా కారణంగా స్వల్పంగా పెంచారు. ప్రణాళికా వ్యయం కింద గత ఏడాదిలో 157.73 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ. 463.62 కోట్లకు పెంచారు. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కింద రావలసిన రూ. 1,747 కోట్లు ప్రతిపాదనలనూ ఈ బడ్జెట్లో చేర్చారు.
ప్రణాళికేతర వ్యయం కింద కళాశాల విద్యకు రూ. 726.25 కోట్లు, ఇంటర్మీడియెట్ విద్యకు రూ. 515.59 కోట్లు ఇచ్చారు. ప్రణాళికా వ్యయం కింద కళాశాల విద్యకు రూ. 30.81 కోట్లు, ఇంటర్ విద్యకు రూ. 69.60 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ కేటాయింపులు భారీగా తగ్గాయి. ప్రణాళికా వ్యయం కింద గత ఏడాదిలో ఇంటర్ విభాగానికి రూ. 105.58 కోట్లుండగా ఇప్పుడు దానికి బాగా కోతపెట్టారు. అలాగే కళాశాల విద్యకు గత ఏడాది రూ. 51.83 కోట్లు ఇవ్వగా ఈసారి భారీగా తగ్గించేశారు.
యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంటర్ విద్యకు నిధుల్లో కోత పెట్టి ప్రభుత్వం కొత్తగా నైపుణ్యాల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన విభాగానికి బడ్జెట్లో ప్రణాళిక పద్దు కింద రూ. 360 కోట్లు కేటాయించారు.
హిందీ అకాడమీకి రూ. 20 లక్షలు కేటాయించగా తెలుగు అకాడమీకి పైసా ఇవ్వలేదు.
రానున్న విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపే రాష్ట్రంలో ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంటు, గిరిజన విశ్వవిద్యాలయాలు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని కేంద్రం నెలకొల్పుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు.
సామాజిక ఆర్థిక సర్వే
43.90 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో చదవుతోన్న 43.90 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.
8.80 లక్షల మంది నిరుద్యోగులు
రాష్ట్రంలో అక్టోబరు, 2014 వరకూ ఉపాధి కల్పించాలని కోరుతూ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు 8.80 లక్షలు. పేదరికం క్రమేణ తగ్గుతూ వస్తోందని.. ప్రస్తుతం రాష్ట్రంలో పేదరికం 9.2 శాతం మాత్రమే ఉన్నట్లు సర్వే స్పష్టీకరించింది.
32.6 శాతం మంది నిరక్షరాస్యులు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత శాతం 67.4 శాతం. అంటే.. 32.6 శాతం మంది నిరక్షరాస్యులేనన్న మాట. పురుషుల్లో అక్షరాస్యులు 74.2 శాతం ఉండగా.. మహిళల్లో 60 శాతం మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యులు 79.2 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 62.4 శాతం మంది ఉన్నారు. అక్షరాస్యతలో 74.32 శాతంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో, 58.89 శాతంతో విజయనగరం చివరి స్థానంలో ఉన్నాయి.
సాంకేతిక విద్యా శాఖకు కేటాయింపులు గత ఏడాదికన్నా ఐదు కోట్లు తగ్గించి రూ. 510.48 కోట్లు ఇచ్చారు.