ఆదాయ మార్గాలు అన్వేషించండి..
హైదరాబాద్: రాష్ట్రానికి ఆర్థికలోటు ఉన్న కారణంగా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సహచర మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గురువారం శాసనసభలో 2015-16 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టడానికి ముందు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రులకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల పత్రాలను అందచేశారు. వారు పరిశీలించిన అనంతరం వాటిని వెనక్కి తీసుకునే ముందర మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదించింది.
ఈ సందర్బంగా చంద్రబాబు.. ఖనిజాలను వెలికితీయటం ద్వారా ఎక్కువ ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఎర్రచందనం అమ్మకాలతో పాటు బెరైటీస్ తదితర ఖనిజాలను వెలికితీసి అమ్మడం ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్నారు. ఇవే కాకుండా ఇంకా ఏఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోగలమో మార్గాలను అన్వేషించాల్సిందిగా మంత్రులను సీఎం కోరారు. సేవారంగం ద్వారా ఇటీవలి కాలంలో ఆదాయం ఎక్కువగా వస్తోందని సీఎం చెప్పారు. ఆ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించటం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. స్థూల జాతీయోత్పత్తిని పెంచుకుంటే ఆదాయం దానంతట అదే పెరుగుతుందన్నారు.