ఆశల బడ్జెట్
‘రాష్ట్ర ప్రజల శ్రేయోసంక్షేమాలే గీటురాయి’గా చెప్పుకున్న నవ తెలంగాణ తొలి పూర్తిస్థాయి బడ్జెట్ బుధవారం ఆవిష్కృతమైంది. లక్షా 15 వేల కోట్ల రూపాయల భారీ పరిమాణంతో రూపొందిన ఈ బడ్జెట్‌లో ప్రధానంగా బలహీన వర్గాల సంక్షేమం, వ్యవసాయం-అనుబంధ రంగాల వికాసం, పారిశ్రామిక అభివృద్ధి అనే మూడు ప్రాధమ్యాలను ఎంచుకున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇందులో సంక్షేమం వరకూ మంత్రి చెప్పిన దాంట్లో నిజముంది. ఆ రంగానికి భారీగా... రూ. 12,740 కోట్లు కేటాయించారు. అయితే, వ్యవసాయం- అనుబంధ రంగాలకు, పరిశ్రమలకూ ఆ స్థాయిలో నిధులు అందజేయలేకపోయారు.
మొత్తంగా వ్యవసాయం-అనుబంధ రంగాలకు చేసిన కేటాయింపు రూ. 8,432 కోట్లయితే అందులో రుణ మాఫీకే దాదాపు సగ భాగం పోతుంది. అటవీ శాఖకు కేటాయించిన రూ. 281 కోట్లు కూడా ఈ పద్దులోనే ఉంది గనుక అది మరింత చిక్కిపోతుంది. వ్యవసాయ శాఖకు గత బడ్జెట్‌లో కేటాయించింది రూ. 1,828.87 కోట్లు కాగా అదిప్పుడు రూ. 1,035.55 కోట్లకు తగ్గింది. ఒకపక్క సాంఘికార్ధిక సర్వేలో వ్యవసాయరంగం గత ఆర్థిక సంవత్సరంలో 10.3 శాతం ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసిందని చెబుతూనే దాన్ని చిన్నచూపు చూడటం అన్యాయం.
ఈటెల విడుదల చేసిన లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 55.49 శాతం మంది ఆ రంగంపై ఆధారపడి ఉన్నారు. ‘మేకిన్ తెలంగాణ’ ధ్యేయమని ప్రకటించి, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో గుజరాత్‌తో పోటీపడదల్చుకున్నట్టు చెబుతూ వస్తున్న ప్రభుత్వం తీరా కేటాయింపుల దగ్గరకొచ్చేసరికి రూ. 973.74 కోట్ల దగ్గరే ఆగిపోయింది. పరిశ్రమల శాఖ దాదాపు రూ. 2,636 కోట్ల మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తే అందులో మూడోవంతుకే ఈటెల పరిమితమయ్యారు.
‘ఇప్పుడు ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పష్టతతో, సమన్వయంతో రూపొందిన పూర్తిస్థాయి బడ్జెట్’ అని ఈటెల తన ప్రసంగంలో చెప్పారు. అయితే, బడ్జెట్‌లోని అంకెలను గమనిస్తే అందులో పూర్తి నిజం లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఆదాయంపై ప్రభుత్వానికున్న అంచనాలు వాస్తవికతకు దగ్గర్లో లేవు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ. 46,494.75 కోట్లుగా చూపడం వరకూ సరేగానీ...అది క్రితంసారి బడ్జెట్‌తో పోలిస్తే రూ. 10,000 కోట్ల పైమాటే అని తెలుసుకున్నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కొత్త పన్నులేమీ విధించకుండానే ఈ అదనపు ఆదాయం ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పలేక పోయింది.
ఇందులో వ్యాట్ ద్వారా వస్తుందని చెప్పే అదనపు ఆదాయం వాటా రూ. 11,116 కోట్లుంది. ఏడాది వ్యవధిలో ఇంత మొత్తం అంటే ప్రతి నెలా వ్యాట్ ద్వారా దాదాపు రూ. 1,000 కోట్ల అదనపు ఆదాయం లభించాలి. ఇది సాధ్యమేనా? బడ్జెట్‌తో సంబంధం లేకుండా పన్నులు విధించే సంస్కృతి మన దేశంలో మొదలై చాన్నాళ్లయినా... తెలంగాణ ఉద్యమానికి సారథ్యంవహించి అధికారంలోకొచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆ తోవను ఎంచుకోదల్చుకున్నదా? ఆ సంగతి ఆచరణలోనే తెలియాలి.
నిరుడు నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భూముల అమ్మకం ద్వారా రూ. 6,500 కోట్లు సమకూరగలదని అంచనా వేసినప్పుడు ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినివున్న ప్రస్తుత తరుణంలో అంత మొత్తం ఎలా సాధ్యమని తప్పుబట్టారు. ఒకపక్క ఆ పద్దుకింద కేవలం రూ. 1,000 కోట్లు మాత్రమే లభించాయని అంగీకరిస్తూనే తాజా బడ్జెట్‌లో ఆ బాపతు ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి చూపడం సాహసమే. భూముల అమ్మకంద్వారా రూ. 13,500 కోట్ల రాబడిని ఆశించడమంటే మాటలు కాదు! ఇక అప్పులు, మద్యం అమ్మకాలు, కేంద్రం ఇచ్చే ప్యాకేజీపై ప్రభుత్వానికున్నవి అత్యాశలే అనిపిస్తుంది.
అయితే, ఒకందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు గణనీయంగా చేసిన కేటాయింపులవల్ల రాష్ట్రంలో ఆయకట్టు పెరగడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల్లో మొత్తం రూ. 11,733 కోట్లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పనులకు కేటాయించారు. కొత్తగా 10 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకుని ఈ కేటాయింపులుచేశారు. అయితే, కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఎందుకనో నిధులు తగ్గించారు. ‘దుబారా’ను తగ్గించుకోవాలని నిర్ణయించుకునే ఏ ప్రభుత్వానికైనా సాధారణంగా ప్రణాళికా వ్యయంపైనే దృష్టిపడుతుంది. ఫలితంగా అందులో భాగంగా ఉండే సంక్షేమానికి కోత పడుతుంది.
తెలంగాణ సర్కారు మాత్రం ఈసారి ప్రణాళికా వ్యయంలో 21.86 శాతం మొత్తాన్ని సంక్షేమానికి కేటాయించింది. ఇది గతంకన్నా దాదాపు 7 శాతం అధికం. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాల పెంపు, బీడీ కార్మికులకు పింఛన్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతం కోసం చేసిన కేటాయింపులు ప్రశంసనీయమైనవి. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తరచుగా చెప్పిన ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య, బలహీనవర్గాలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం సంగతిని ఈటెల బడ్జెట్ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. వైద్య, ఆరోగ్య రంగాలకు నిరుటితో పోలిస్తే బడ్జెట్‌లో పెద్దగా దక్కిందేమీ లేదు.
విద్యారంగానికి కేటాయింపులైతే ఘనంగా కనిపిస్తున్నా గతంతో పోలిస్తే అవి తక్కువే. ఇందులో కూడా ఉన్నత విద్య, సాంకేతిక విద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చి కీలకమైన పాఠశాల విద్యకు మాత్రం కేటాయింపులు కుదించారు. కేంద్ర ప్రభుత్వంనుంచి వచ్చే గ్రాంట్లు గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆ ప్రభావం వివిధ రంగాల కేటాయింపులపై స్పష్టంగా కనబడుతోంది. బడ్జెట్‌లో కేటాయింపుల పేరిట పొందుపరిచే గణాంకాలకూ, వాస్తవ వ్యయానికీ పొంతన లేని స్థితి దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో తాను భిన్నమని నిరూపించుకోగలిగితే, సమర్థతను ప్రదర్శించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.