ఇక పన్నుల బాదుడే బాదుడు! | The tax stroke Bang! | Sakshi
Sakshi News home page

ఇక పన్నుల బాదుడే బాదుడు!

Published Fri, Mar 13 2015 3:00 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

The tax stroke Bang!

  • రానున్న రోజుల్లో పన్నులు, చార్జీల మోత
  •   వీటి ద్వారా రూ.7 వేల కోట్ల ఆదాయం ఆశిస్తున్న సర్కారు
  •   అన్ని విభాగాల్లో యూజర్ చార్జీల పద్దులు
  •   2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7,300 కోట్ల రెవెన్యూ లోటు
  •   రూ.1,13,049 కోట్ల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రి యనమల
  •   ద్రవ్యలోటు రూ.17,584 కోట్లుగా అంచనా
  •   భారీగా తగ్గిపోయిన ప్రణాళికా వ్యయం
  •   వ్యాట్ ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
  • సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వచ్చే ఏడాదిలో పన్నుల ఆదాయం అదనంగా రూ.7 వేల కోట్లకు పైనే వస్తుందని బడ్జెట్‌లో వేసిన ప్రభుత్వ అంచనాలు.. రానున్న రోజుల్లో పన్నులు, చార్జీల మోత తప్పదని తేల్చేశాయి! లోటును పూడ్చుకోవడానికి వనరుల సమీకరణ ఎలా చేస్తారన్నది కూడా చెప్పకపోవడం చూస్తుంటే ప్రజలపై బాదుడు తప్పదని స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.7,300 రెవెన్యూ లోటుతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1,13,049 కోట్ల బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీకి సమర్పించారు.

    ద్రవ్యలోటు రూ.17,584 కోట్లుగా అంచనా వేశారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికే వెచ్చించనున్నారు. ప్రణాళిక, ప్రణాళికేతరలో మొత్తం రెవెన్యూ వ్యయం ఏకంగా రూ.97,224 కోట్లుగా పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయాన్ని భారీగా పెంచడం గమనార్హం. ప్రణాళికా వ్యయాన్ని రూ.34,412 కోట్లకే పరిమితం చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల కేటాయింపుల పరిమాణం తగ్గిపోయింది. బడ్జెట్‌లో అన్ని విభాగాల్లో యూజర్ చార్జీల పద్దులను పెట్టారు.

    కొన్ని ఇప్పటికే యూజర్ చార్జీలను వసూలు చేస్తుండగా కొత్తగా ఆసుపత్రుల్లో ఈ చార్జీలను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో యూజర్ చార్జీల ద్వారా రూ.500 కోట్లు ఆదాయం అంచనా వేశారు. వ్యాట్ రూపంలోనే అదనంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా అదనంగా రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో ‘కాంట్రా ఇంట్రెస్ట్’ను రద్దు చేశారు. పన్నేతర ఆదాయం రూ.5,341 కోట్లు వస్తుందని అంచనా వేశారు.

    ఇందులో గనుల రంగం ద్వారా రూ.1,359 కోట్లు, ఎర్ర చందనం విక్రయం, ఇతర అటవీ ఉత్పత్తుల ద్వారా రూ.1,072 కోట్లు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. రూ.17,500 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించగా... ఆస్తుల కల్పనకు మాత్రం కేవలం రూ.9,818 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించింది. ఈ ఆస్తుల కల్పన వ్యయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆస్తుల కల్పన వ్యయంలో కేటాయింపులను భారీగా తగ్గించేశారు. కేంద్ర, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.67,061 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.55,313 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
     
    విద్యకు అరకొరే..

    ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్లు అవసరమని ప్రతిపాదించగా బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లే కేటాయించారు. సంక్షేమ పెన్షన్లకు రూ.3,741 కోట్లు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,645 కోట్లు ప్రతిపాదించారు. అయితే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ.1,700 కోట్లు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి అనుగుణంగా  వ్యాట్ ఆదాయం వచ్చినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఎక్సైజ్ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా రూ.200 కోట్ల రూపాయలు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా లక్ష్యం కన్నా ఏకంగా రూ.440 కోట్లు, రవాణా రంగం ద్వారా రూ.435 కోట్లు అదనంగా వచ్చినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు.

    బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం రూ.4,580 కోట్లు కేటాయించారు. అయితే విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు. ఆ రంగాలకు గత కేటాయింపుల కన్నా పెంచారు. విద్యారంగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14,265 కోట్లు కేటాయించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్య రంగానికి కేటాయింపులను కూడా పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.4,134 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,363 కోట్లు కేటాయించారు. ప్రజారోగ్యానికి మాత్రం మొండిచేయి చూపారు.

    ఈ రంగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.497 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.296 కోట్లే ప్రతిపాదించారు. పట్టణ ఆరోగ్య సేవలకు కేటాయింపులను పెంచినా గ్రామీణ ఆరోగ్య సేవలపై చిన్నచూపు చూశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో నచ్చిన వారికి పనులు మంజూరు చేసేందుకు వీలుగా ప్రణాళిక శాఖలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో రూ.500 కోట్లు కేటాయించారు. అలాగే ఏడు రంగాలకు చెందిన మిషన్ల కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపునకు ఏకంగా రూ.50 కోట్లు కేటాయించడం గమనార్హం.
     
    ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు దాటిన ద్రవ్యలోటు

    2014-15 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ద్రవ్యలోటు రూ.12,064 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.30 శాతంగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు రూ.20,320 కోట్లకు చేరిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.88 శాతంగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు ద్రవ్య లోటు మూడు శాతానికి మించకూడదు. 2014-15 బడ్జెట్ సమయంలో పేర్కొన్న దాని కన్నా సవరించిన అంచనాల దగ్గరకు వచ్చే సరికి అప్పులు రూ.8,000 కోట్లు పెరిగినట్లు తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు 14,242 కోట్ల రూపాయలకు చేరినట్లు యనమల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement