ఆదాయానికి మార్గాన్వేషణ: యనమల
హైదరాబాద్: సమానత్వం, గతిశీలత, సమగ్రత సాధించే దిశగా రాష్ర్ట బడ్జెట్‌ను రూపొందించినట్లు పేర్కొన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో రూ. 1.13 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాదితో పోల్చితే 1.1 శాతం పెరుగుదలతో తాజా బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి రెండు గంటలకుపైగా ప్రసంగించారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలకు కేటాయింపులను పెంచుతున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. ఇంగ్లీష్ కవి వాల్ట్ విట్మన్ ప్రస్తావనతో ముగించారు. మధ్యలో నోబెల్ గ్రహీత జార్జ్ బెర్నార్డ్‌షా మాటలనూ ప్రస్తావించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
విభజన చట్టంలో ఏపీ అభివృద్ధి కోసం చూపించినవ న్నీ మొక్కుబడి అవకాశాలే. చట్టంలో ఉన్న హామీలేవీ కొత్త రాష్ట్ర మనుగడకు సరిపోయేవి కాదు. విభజనతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో లేవు. చట్టం లో ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా ప్రయత్నిస్తాం. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి దక్కనున్న నిధులు, కేంద్ర బడ్జెట్ కేటాయింపుల ప్రకారం అందే సహాయం రెండూ కలిసినా రెవెన్యూ లోటు భర్తీ కావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరమే కాకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు అందే ఆఖరు సంవత్సరం వరకూ లోటు భర్తీ అయ్యే అవకాశం లేదు. మరిన్ని రుణాలు తెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా భవిష్యత్‌లో రుణ భారం, ఆర్థిక లోటు మరింతగా పెరుగుతాయి.
2015-16 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 7.89% ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.41%గా ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా. తెలంగాణలో 9.99%, 10.26%గా ఉంటుందని అంచనా. బడ్జెట్ పరిమాణం గతేడాది కంటే కేవలం 1.1% అధికం. కానీ ప్రణాళికా వ్యయం 29.02% పెరిగింది. ప్రణాళిక, ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం తగ్గింది. రూపాయి విలువ తగ్గిపోతూ వస్తోంది. గతంలో వందల్లో, తర్వాత వేలల్లో చూపిస్తున్న కేటాయింపులను ఈ బడ్జెట్ నుంచి రూ. లక్షల్లో చూపిస్తున్నాం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తలసరి ఆదాయం 2018-19 నాటికి రెట్టింపవుతుంది. పాఠశాల విద్యకు కేటాయింపులను 11.26% నుంచి 13.24 శాతానికి పెంచుతున్నాం. మాతా శిశుమరణాలను తగ్గించడానికి వైద్య రంగానికి కేటాయింపులను 3.92% నుంచి 5.07 శాతానికి పెంచుతున్నాం. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఆధార్‌తో అనుసంధించే ప్రక్రియలో రాష్ర్టం ముందంజలో ఉం ది. నిరుద్యోగులకు భృతిని ప్రభుత్వం అందిస్తుంది. అత్యవసర సేవలను సమర్థంగా అమలు చేయడానికి మెడికల్, పారామెడికల్, టీచర్లు, ఇంజనీర్లు, పో లీసు, హోంగార్డు ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనున్నాం. ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ప్రకటించాం. వారి జీతభత్యాల మీద చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చు.. రాష్ట్ర అభివృద్ధికి మదుపుగా మారుతుందని ఆశిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయింపులు బడ్జెట్‌లో 22.61 %గా ఉన్నాయి.
బీసీలకూ సబ్‌ప్లాన్ అమలు చేయనున్నాం. కాపుల సంక్షేమానికి రూ. 100 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 35 కోట్లు కేటాయించాం. రుణమాఫీకి వీలుగా రైతు సాధికార సంస్థకు 5 వేల కోట్లు విడుదల చేశాం. తొలిదశ పూర్తి చేశాం. 2వదశ రూపకల్పన త్వరలో పూర్తవుతుంది. వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తాం. చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేయనున్నాం. 7,748 గ్రూపులకు చెందిన 20,747 మంది నేత కార్మికుల రుణాల మాఫీకి రూ. 169 కోట్లు అవసరమని అంచనా. మాఫీ విధివిధానాలు రూపొందిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ, సెంట్రల్, పెట్రోలియం, వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యలో నాణ్యతను పెంపొందించడానికి రాష్ట్రస్థాయి ‘అసెస్‌మెంట్, అక్రిడిషన్ కౌన్సిల్’ను నెలకొల్పనున్నాం. పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడానికి ‘ఏపీ రీసెర్చ్ బోర్డ్’ను ఏర్పాటు చేయనున్నాం. సరైన ప్రణాళిక లేకుండా రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో నిరర్థకంగా మారిపోయే ప్రమాదముంది. అందుకే సమగ్ర ప్రణాళికతో నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 33,252 ఎకరాల విస్తీర్ణంలో రైతుల సమ్మతితోనే రాజధాని నిర్మాణం జరగుతోంది. 87% మంది రైతులు భూ సేకరణకు అంగీకరించారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ రంగాలను అనుసంధానిస్తూ ‘హరిత’ పేరిట సమగ్ర సమాచార వ్యవస్థను తయారు చేయనున్నాం.