సాక్షి ప్రతినిధి,ఒంగోలు: దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు సైతం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. అవేర్‌నెస్ క్యాంపులు, టుకే రన్‌లు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓట్లు నమోదు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని ప్రకటిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓటు కోసం దరఖాస్తు చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా వెరిఫికేషన్ పూర్తి కావడం లేదు. ఒకటికి నాలుగుసార్లు దరఖాస్తులిచ్చినా అవి అప్‌లోడ్ కావడం లేదు. అప్‌లోడ్ అయితే వెరిఫికేషన్‌కు నోచుకోవడం లేదు. వెరిఫికేషన్ జరిగితే తహసీల్దార్ లాగిన్‌కు వెల్లడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఓటు నమోదుకు ఇంకా మూడు రోజులు మాత్రమే గడువుంది.రెండునెలలుగా పరిష్కారం కాని సమస్య మూడు రోజుల్లో పరిష్కారమవుతుందా..? అనే సందేహాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతల కనుసన్నలలోనే కొత్త ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారి ఓట్లను మాత్రమే అధికారులు నమోదు చేసే ప్రక్రియ చేస్తున్నారని, మిగిలిన దరఖాస్తులను పక్కన పడేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న తంతు చూస్తే ఇదే నిజమన్న అభిప్రాయం కలుగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటు నమోదులో అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అవసరం ఉంది.
జనవరి 11న ఓటర్ల జాబితా వెల్లడించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా 2,05,668 ఫాం–6 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకూ 78,878 దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిశీలించారు. ఇందులో 65,089 దరఖాస్తులు ఓకే చేశారు. 13,789 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 1,26,790 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. రాబోయే మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రానున్నాయి. వెరిఫికేషన్ పూర్తవగానే ఓటు నమోదైనట్లు కాదు. వాస్తవానికి ఓటు దరఖాస్తులను ఆన్‌లైన్ నుంచి తొలుత డౌన్‌లోడ్ చేస్తారు. వాటిని బీఎల్‌ఓలకు ఇచ్చి వెరిఫికేషన్ చేయిస్తారు. అది సక్రమమైతే దరఖాస్తుదారుడి నుంచి ఆధార్ లేదా మరో ప్రూఫ్ తీసుకుంటారు. అనంతరం ఆ వివరాలను తహసీల్దారు (ఏఆర్వో) లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆర్వో లాగిన్‌కు వెళ్లాలి. ఆర్వో ఓటు హక్కును ఓకే చేస్తారు. అప్పుడే ఓటు నమోదైనట్లు లెక్క. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితేనే ఓటు నమోదవుతుంది. లేకపోతే లేదు. తాజా పరిస్థితి చూస్తే ప్రాసెస్ లేటవుతోంది.
జిల్లావ్యాప్తంగా 3,269 మంది బీఎల్‌ఓలు, వారిపైన సూపర్‌వైజర్లు, ఆ పైన మానిటరింగ్ అధికారులు, వారిపై ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, వారిపై తహసీల్దార్లు, వీరిపైన ఆర్డీఓ కార్యాలయం అధికారులు ఓటు నమోదును పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. అయినా, ఈ తంతు సక్రమంగా జరగడం లేదు. గడిచిన రెండు నెలల కాలంలో వచ్చిన వాటిలో 40 శాతం దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. పరిశీలించిన దరఖాస్తులు ప్రాసెస్ పూర్తయినట్లు కాదు. ఇంకా ఇప్పటికే 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉండగా, మరో నాలుగు రోజులపాటు రావాల్సినవి పెద్ద ఎత్తున ఉన్నాయి. ఉన్న నాలుగు రోజుల గడువులో ఎన్ని దరఖాస్తులను పరిశీలించి మొత్తం తంతు పూర్తి చేస్తారన్నది తెలియని పరిస్థితి.
గడిచిన రెండు నెలల కాలంలో కేవలం 78 వేల దరఖాస్తులను పరిశీలించడాన్ని చూస్తే అన్నింటిని పరిశీలించి ఓటు నమోదు చేయడం ఇప్పట్లో జరిగేలా లేదు. ఇదే జరిగితే కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఓటు రానట్లే. ఎన్నికల కమిషన్ చెబుతున్న దానికీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనికీ పొంతన లేదు. జిల్లా కలెక్టర్ ఓటు హక్కుపై ప్రచారానికే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనిని పరిశీలించాలి. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఓటుహక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
ఓకే అయిన దరఖాస్తులు | 65,089 |
తిరస్కరించినవి | 13,789 |
పరిశీలించాల్సినవి | 1,26,790 |
Comments
Please login to add a commentAdd a comment