ప్రతీకాత్మక చిత్రం
గుండె మార్పిడికి వచ్చిన దరఖాస్తులు 25
ఒక్కోఆపరేషన్‌కు ఖర్చు రూ.25 లక్షలు
సీఎం ఒక్కో ఆపరేషన్‌కు ఇస్తానన్న నిధులు రూ.15 లక్షలు
సృహృదయ ట్రస్ట్ ద్వారా జరిగిన ఆపరేషన్లు 450
‘గుండె జబ్బు.. ప్రాణాంతకమైన రుగ్మత.. గుండె మార్పిడి తప్పనిసరి.. దిన దిన గండం.. ఇప్పుడా? అప్పుడా? అన్నట్లు ఆపరేషన్.. కనికరించని ప్రభుత్వం..’ ఇదీ బాధితుల క్షోభ..! చెప్పలేనంత బాధ ‘గుండె’ల్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు దీనులు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్‌కు సాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ నీటి మూటగా మిగలడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులిస్తే ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చిన ‘సహృదయ’ ట్రస్ట్‌కు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఏడాది నుంచి 25 మంది బాధితులు గుండెను గుప్పెట్లో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న గుండె వైద్య విభాగంలో గతంలో గుండె రోగులకు కేవలం యాంజియోగ్రామ్, స్టంట్‌లు మాత్రం వేసేవారు. ఒక్క బైపాస్ సర్జరీ కూడా చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చదువుకున్న ఊరుకు సేవ చేయాలనే లక్ష్యంతో సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్) విధానంలో గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం 2015 మార్చిలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
2015 మార్చి 18న మొట్టమొదటి బైపాస్ సర్జరీ చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు సుమారు 450 ఓపెన్ హార్ట్ సర్జరీలు నిరుపేదలకు ఉచితంగా నిర్వహించారు. అంతటితో ఆగకుండా 2016 మే 20న గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు గుండె మార్పిడి ఆపరేషన్ చేసి జాతీయ స్థాయిలో జీజీహెచ్ ప్రతిష్ట పెంచారు. జాతీయ స్థాయిలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసిన ఐదో ప్రభుత్వ ఆసుపత్రిగా జీజీహెచ్ రికార్డు సృష్టించేలా చేశారు. 2017 జనవరి 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల గుండె ఆపరేషన్‌లు చేస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్‌ను నిలిపారు.
నీటి మూటగా హామీ..
ఏడాది నుంచి జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తే ఆపరేషన్లు నిర్వహించేందుకు సహృదయ ట్రస్టు ముందుకు వచ్చింది. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రెండేళ్ల క్రితం ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కానీ.. హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
జీజీహెచ్‌లో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడు
ఒక్క రూపాయి మంజూరు కాలేదు..
జీజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్స విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండె మార్పిడి ఆపరేషన్, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే బృందాన్ని అభినందించిన సందర్భంలో గుండె మార్పిడి ఆపరేషన్‌లకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌లు మరిన్ని జరుగుతాయని అంతా ఆశించారు. గుండె మార్పిడి ఆపరేషన్‌ల కోసం సుమారు 25 మంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకుని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఆపరేషన్లు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క రూపాయి మంజూరు కాలేదు. మార్చి 18వ తేదీతో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ముగుస్తున్న నేపథ్యంలో సహృదయ ట్రస్టు తిరిగి తన సేవలను కొనసాగిస్తుందా? లేక ప్రభుత్వ, వైద్య విద్యాధికారుల సహకారం కొరవడిందని విరమించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది.
ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ఇదీ..!
ఆపరేషన్ చేయించుకున్న ఏడుకొండలు(ఫైల్ ఫోటో)
సీఎం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయనప్పటికీ మొట్టమొదట గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఉప్పు ఏడుకొండలు కేస్ స్టడీని ఎన్టీఆర్ వైద్య సేవ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టి కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తనకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసిందని, కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏడుకొండలు మాట్లాడిన విషయాలను ఇందులో పేర్కొనడం విశేషం. డబ్బులు మంజూరు చేయకుండా, ప్రచార ఆర్భాటాలకు మాత్రం వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఏడుకొండలుకు జరిగిన ఆపరేషన్ వివరాలు నమోదు చేసిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment