కొడవలూరు, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన, సద్భావన, దాతృత్వం, సద్గుణాలు అలవరుచుకుంటేనే శాంతి చేకూరుతుందని మత గురువులు బోధించారు. మహ్మద్ ప్రవక్త సందేశాన్ని అందరికీ వినిపించారు. చంద్రశేఖరపురంలో నిర్వహిస్తున్న ఇస్తిమా ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. భక్తులనుద్దేశించి మత గురువులు మాట్లాడుతూ ఐదు పూటలా నమాజ్ చేయడంతో పాటు పొరుగువారికి సాయపడాలని పిలుపునిచ్చారు. భగవంతునిపై మనసు లగ్నం చేసి, దైనందిక కార్యక్రమాలను కొనసాగించినప్పుడే చెడు విషయాలకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. ఉర్దూలో అర్థం కావడం లేదని కొందరు తెలియజేయడంతో 15 నిమిషాల పాటు తెలుగులో బోధన సాగింది.
మరో మక్కా
ఇస్తిమా ప్రాంగణం మరో మక్కాను తలపిస్తోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 5 లక్షల మంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే ‘దువా’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఇందులో సుమారు పది లక్షల మంది వరకు పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు.
నిలిస్తే జనసంద్రమే
జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు మతగురువుల ప్రసంగం విన్న వెంటనే తిరుగుముఖం పడుతున్నారు. వివిధ వ్యాపకాల్లో బిజీగా ఉన్న వారు ఏదో ఒక సమయంలో వచ్చి కొన్ని కార్యక్రమాలకు హాజరై వెళుతున్నారు. ఒకట్రెండు గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు రాత్రింభవళ్లు ఇక్కడే ఉండి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను నిషేధించడంతో మతపెద్దల చెబుతున్న అమూల్యమైన సందేశాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలకిస్తున్నారు. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల లగేజీలకు వెయ్యి మంది వలంటీర్లు రక్షణ కల్పిస్తున్నారు. 104,108 సిబ్బందితో పాటు నిజామ్స్, నారాయణ తదితర ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందిస్తున్నారు.
సత్ప్రవర్తన, సద్భావనతోనే శాంతి
Published Mon, Feb 17 2014 3:10 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement