‘‘అనంత’కు మంజూరైన రూ.227 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయకుండా బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. దీన్ని ఆపాలని చంద్రబాబుకు విన్నవించా! ఆయన సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’’
- మంత్రి పల్లె వ్యాఖ్యలు
‘‘రైతులకు సంబంధించిన ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా)తో పాటు ఎలాంటి బీమా పరిహారాన్నైనా బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవచ్చు’’
- ఈనెల 4న ప్రభుత్వం జారీ చేసిన 218 జీవోలో పేర్కొన్న కీలకాంశం.
‘‘పంటల బీమా సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ పాతబకాయిల కింద జమ చేసుకునేందుకు వీల్లేదు. కచ్చితంగా రైతుల ఖాతాలో జమ చేయాల్సిందే!
-2005 పార్లమెంట్ చట్టం చెబుతున్న వాస్తవమిది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రుణమాఫీతో రైతులను నిలువునా ముంచేసిన ప్రభుత్వం మరో వంచనకు ఉపక్రమించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే కరువు జిల్లా అయిన అనంతపురం రైతులను పెద్దదెబ్బ తీసేలా జీవో 218ని జారీ చేసింది. ఈ నెల 4న రుణమాఫీపై విధాన ప్రకటన చేసిన చంద్రబాబు, అదే రోజు 218 జీవోను జారీ చేసి ‘అనంత’ రైతులకు తీవ్ర అన్యాయం చేశారు.‘ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణమాఫీలో రైతుకు నష్టం కల్గించే చర్యలు అవలంభించిన ప్రభుత్వం.. 218 జీవోతో పూర్తిగా ముంచేసింది.
వాతావరణబీమా సొమ్మును బకాయిల్లోకి జమ చేసుకోండి:
2013-14 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు దాదాపు రూ.227 కోట్ల వాతావరణ బీమా ప్రీమియం మంజూరైంది. బీమా సొమ్ము రెన్నెళ్ల క్రితం బ్యాంకులకు చేరినా ఆ సొమ్మును రైతుల ఖాతాల్లోకి బ్యాంకర్లు జమ చేయలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బీమా సొమ్మును పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం బ్యాంకర్లు చేసిన ఈ చర్య చట్ట విరుద్ధం. 2005లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం బీమా సొమ్ము ఎట్టి పరిస్థితుల్లో బకాయిల కింద జమ చేసుకోకూడదు. కచ్చితంగా రైతుల ఖాతాల్లో జమ చేసి తీరాలి. కానీ బ్యాంకర్లు భిన్నంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఈ నెల 4న ఓ జీవో జారీ చేశారు.
అందులోని 11 కాలమ్‌లో ‘‘అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా’కు సంబంధించిన బీమా పరిహారాన్ని పాతబకాయిల కింద జమ చేసుకోవచ్చని బ్యాంకర్లకు అధికారికంగా అనుమతిచ్చేశారు. అంటే రైతులు నిజాయితీతో బీమా ప్రీమియాన్ని చెల్లించి, పంట నష్టపోయి, వారికి హక్కుగా రావాల్సిన సొమ్మును కూడా చంద్రబాబు సర్కారు దక్కకుండా చేస్తోందన్నమాట! అయితే నిజానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో 218, పార్లమెంట్ చట్టానికి విరుద్ధంగా జారీ చేయబడింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో చెల్లుబాటు కాదు. అయితే ఈ జీవో జారీతో రైతులపై ప్రభుత్వానికి ఉన్న కుటిలబుద్ధి బట్టబయలైంది.
రైతులపై ‘పల్లె’కున్న ప్రేమ ఎంత గొప్పదో:
బీమాకు రైతులు ప్రీమియం చెల్లించారు, వారికి బీమా సొమ్ము హక్కుగా దక్కాలి. అయితే రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో సర్కారు అవలంభించిన అసంబద్ధ వైఖరితోనే బీమాపరిహారాన్ని బ్యాంకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పైగా ప్రభుత్వం కూడా ఓ జీవో జారీ చేసింది. ఈక్రమంలో ‘అనంత’ రైతులకు అన్యాయం చేసే జీవోను, పైగా పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఎలా జారీ చేస్తారని చంద్రబాబును మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు జిల్లా అధికారపార్టీ నేతలు ప్రశ్నించాలి. అయితే బీమాసొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని తాను సీఎంకు విన్నవించానని, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, అందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలని పల్లె చెబుతున్నారు. రైతులకు రావాల్సిన బీమా సొమ్ము రావడంలో సీఎం కృషి ఏంటో పల్లెగారి విశదీకరించి చెబితే బాగుంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అంతా మోసం!
Published Mon, Dec 15 2014 3:13 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM
Advertisement
Advertisement