రైతుల గోడు పట్టని ప్రభుత్వాలు
అనంతపురం అగ్రికల్చర్:
అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, చంద్రబాబునాయుడు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం మానేశాయని అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ నాయకులు విమర్శించారు. దేశవ్యాప్తంగా 160 రైతు సంఘాలతో ఏర్పాటైన అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) చేపట్టిన దేశవ్యాప్త కిసాన్ ముక్తియాత్ర అనంతపురం చేరిన సందర్భంగా సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో రైతులతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే శాశ్వత రుణవిముక్తి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో నవంబర్ 20న చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు యోగేంద్రయాదవ్, పీఎం సింగ్, మధ్యప్రదేశ్ ఎంపీ రాజుశెట్టి, కవిత కురుగంటి, డాక్టర్ సునీలం, అవిక్‌సాహాతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, ఏపీ రైతాంగ సమాఖ్య నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరెడ్డి, ఏపీ రైతు సంఘం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, పి.రామచంద్రయ్య, రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షుడు పి.వెంకటరామయ్య, మానవహక్కుల నేత చంద్రశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో, ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. అరకొర రుణమాఫీ, మొక్కుబడి రాయితీలు, గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో 11,500 మంది, 2015లో 13వేల మంది, 2016లో 13,500 మంది, ఈ ఏడాది 10వేల మంది రైతులు వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చే స్థోమత లేక బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అనంతపురం లాంటి జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందన్నారు. లక్షలాది మంది రైతులు, కూలీలు పొట్టకూటి కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. పాలకుల వైఖరి చూస్తే జైజవాన్–జైకిసాన్ కాకుండా మర్ జవాన్–మర్ కిసాన్‌లా తయారైందన్నారు. కార్పొరేట్ శక్తులు, పారిశ్రామికవేత్తలు అడగకున్నా వందల ఎకరాల భూములు ఇవ్వడం.. వందలు, వేల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయానికొచ్చే సరికి బడ్జెట్ లేదనడం, కంటి తుడుపు చర్యలకు దిగుతోందని విమర్శించారు.