AP Grama Sachivalayam Jobs Written Test Exam Centers List District Wise - Sakshi
Sakshi News home page

‘సచివాలయ’ రాత పరీక్షలకు 4,478 కేంద్రాలు

Published Thu, Aug 22 2019 3:55 AM | Last Updated on Thu, Aug 22 2019 4:39 PM

Exam centers in all districts for first day examination for AP Grama Sachivalayam Jobs - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన పరీక్షకు ఒక్కో రోజు చొప్పున సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండు పూటలా రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన జరిగే వివిధ ఉద్యోగాల రాత పరీక్షకు అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగే మిగిలిన ఉద్యోగాల రాతపరీక్షకు మాత్రం ఏడు జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తొలి రోజు 13 జిల్లాల్లో 4,478 కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 306, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పు గోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 323, చిత్తూరులో 380, వైఎస్సార్‌ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సెప్టెంబర్‌ 3, 4, 6, 7, 8 తేదీల్లో జరిగే రాత పరీక్షకు 7 జిల్లాల్లో 536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 6,19,812 మంది పరీక్ష రాయనున్నారు.
 
రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు 
సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే రాతపరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వాహణపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిపి ఆయన బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచి, ప్రత్యేక ఎస్కార్టుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement