సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల తేదీల మార్పు కష్టంగానే కనిపిస్తోంది. ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. అయితే వరుసగా పరీక్షలు ఉన్నాయని, కాబట్టి సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు.
గురువారం టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. పలు ప్రతిపక్ష పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సర్విస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. వాయిదా వేస్తే ఎదురయ్యే పరిణామాలను అధికారులు సమీక్షిస్తున్నారు.
ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించొచ్చనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు, ఒకవేళ వాయిదా గనుక వేస్తే దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల ప్రక్రియతో అధికార యంత్రాంగం బిజీగా ఉండడం, రెండున్నర నెలల వరకు ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకుండా బుక్ అయిపోవడంతో పరీక్షల వాయిదాపై కమిషన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల్లో గందరగోళం...
గతేడాది డిసెంబర్‌లో గ్రూప్–2 ఉద్యోగ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీని దాదాపు ఐదు నెలల క్రితమే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. పరీక్ష తేదీ చాలా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పుస్తకాలు చేతబట్టారు.
అయితే మరికొన్ని పరీక్షలు సైతం సమీప తేదీల్లోనే ఉండటంతో గ్రూప్–2 వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతోంది. అయితే టీఎస్‌పీఎస్సీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక స్పష్టత ఇచ్చి ఈ గందరగోళానికి తెరదింపాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment