భారీ ఎత్తున్న నల్లబెల్లం పట్టివేత
బెల్ల ఊట ధ్వంసం 15మంది అరెస్ట్
పాడేరు రూరల్: నల్లబెలం,అమ్మోనియా సరఫరా, సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు చేసి, పెద్ద మొత్తంలో నల్లబెలం, అమ్మోనియా, సారాను పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గుమ్మడిగుండువాల గ్రామంలో కొన్నాళ్లుగా యథేచ్ఛగా సారా తయారీ, అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసింది. దీంతో బుధవారం సిబ్బంది గ్రామానికి చేరుకుని దాడులు నిర్వహించి 300 లీటర్ల సారను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వినియోగించే వెయ్యి కిలోల నల్లబెల్లం, 200 కిలోల అమ్మోనియాను కూడా పట్టుకున్నారు. నల్లబెల్లం, అమ్మోనియా సరఫరా చేస్తున్న చీడికాడ మండలం తుంగటపల్లి గ్రామానికి చెందిన జెర్రిపోతుల దేముడు, హుకుంపేటకు చెందిన బి.రమణ మ్మలతో పాటు సారా తయారు చేస్తున్న గుమ్మడిగుండువా గ్రామానికి చెందిన మర్రి రత్తు, కిల్లో సురేష్, మర్రి గోపాలరావు, మర్రి కొములు, మర్రి శ్రీను, మర్రి నాగేశ్వరరావు, మర్రి కాంతమ్మ, మర్రి సుబ్బారావులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ ఎరుకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జి.మాడుగుల మండలంలో..
జి.మాడుగుల: మండలంలో భీరం పంచాయతీ కేంద్రానికి సమీపంలో సారా తయారీ కేం ద్రాలపై బుధవారం పోలీసులు దాడి చేసి, సుమారు వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న కె చిట్టమ్మ, కె కృష్ణారావు, బి భాస్కరరావు, ఎస్ పంతులుబాబు, బి సంజీవరావును అరెస్టు చేసి, వారి వద్ద 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతూ మండలంలో సారా తయారీ, విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో అదనపు ఎస్‌ఐ శ్రీనివాసరావు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ మండలంలో
డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుం పంచాయతీ ఒంబి గ్రామంలో ఎక్స్‌జ్ సీఐ కె.వి.ఎస్.ఎస్. కుమారి ఆధ్వర్యంలో సారా బట్టీలపై దాడి చేసి, పది వేల లీటర్ల బెల్లం పులును ధ్వంసం చేశారు. అలాగే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న రాయిపాడు గ్రామంలో డుంబ్రిగుడ ఎస్‌ఐ బి రామకృష్ణ ఆధ్వర్యంలో సారా బట్టీలపై దాడులు జరిపి రెండువేల లీటర్ల సారా, ఐదు వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు.