‘ఎక్సైజ్’ ఎక్సర్సైజ్ ! | "Excise" Exercise! | Sakshi
Sakshi News home page

‘ఎక్సైజ్’ ఎక్సర్సైజ్ !

Published Tue, Feb 9 2016 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

"Excise" Exercise!

సారా అంతానికి కసరత్తు
సారా త యారవుతున్న గ్రామాలు 241
ఏ క్లాస్ సెంటర్లు 37, బీ క్లాస్ సెంటర్లు 58, సీ క్లాస్ సెంటర్లు 145
తయారీ మానకపోతే పీడీ యాక్టుల నమోదు
ఇప్పటికే 400 మందిపై బైండోవర్ కేసులు
ఏప్రిల్ నాటికి సారా రహిత జిల్లా చేస్తామంటున్న ఎక్సైజ్ శాఖ

 
చిత్తూరు:  జిల్లాలో నాటుసారా కనిపించకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సారా తయారీదారులపై పీడీ యాక్టు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సారా తయారీ గ్రామాలు, తయారీదారుల జాబితాలను ఆ శాఖ సిద్ధం చేసింది. 400 మంది సారా తయారీదారులపై లక్ష రూపాయల పూచీకత్తుతో బైండోవర్ కేసులు కూడా నమో దు చేసింది.

నవోదయం కార్యక్రమం పేరుతో చిత్తూరును సారా రహిత జిల్లా చేయాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలుత సారా తయారీ కేంద్రాలు, తయారీదారులను గుర్తించారు. వీటిని ఏ,బీ,సీలుగా విభజించారు. జిల్లా వ్యాప్తంగా ఏ- క్లాస్ సారా తయారీ కేంద్రాలు 37 ఉండగా, 59 బీ-క్లాస్, 145 సీ - క్లాస్ తయారీ కేంద్రాలున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో సారా తయారీ కేంద్రాలు అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి జిల్లాలో నాటుసారా లేకుండా చేయాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. తొలుత నాటుసారా తయారీ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. పోలీసు, రెవెన్యూ, న్యాయ విభాగాలతోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి చైతన్యకార్యక్రమాలు నిర్వహించనున్నారు. సారా తయారీ వల్ల నష్టాలు, కష్టాలు వివరించడంతో పాటు తయారీ నేరమనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ తొలి విడత దాడులు నిర్వహించనుంది. రెండుమార్లు పట్టుబడిన సారా తయారీదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయనున్నారు. మరోవైపు సారా రహిత చిత్తూరు జిల్లా చేయాలని కలెక్టర్ పలువురు అధికారులతో స్టడీ టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో న్యాయమూర్తి, తహశీల్దార్, షుగర్ కేన్ కమిషనర్, మార్కెఫెడ్ ఎండీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.

కుప్పంతో పాటు పలు నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ ముఖ్య నేతలే నాటుసారా తయారీలో కీలక భూమిక పోషిస్తున్న విషయం అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. నాటుసారా తయారీకి ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాటుసారా తయారీకి నల్లబెల్లం అధికంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో బెల్లాన్ని నాటుసారా వ్యాపారులు కాకుండా ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ షుగర్ కేన్, మార్కెఫెడ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి చిత్తూరును సారా రహిత జిల్లాగా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎక్సైజ్ శాఖ డీసీ సత్యప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. తయారీ ఆపకపోతే పీడీ యాక్టులు తప్పవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement