ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎక్సైజ్ అధికారుల అక్రమాలపై పాలక, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఏకమై ధ్వజమెత్తారు. అధికారులు అక్రమాలకు పాల్పడుతూ మద్యం ధరలను ఎమ్మార్పీకి కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, బెల్టుషాపులు నడుస్తున్నా ముడుపులు పుచ్చుకొని వదిలేస్తున్నారని విమర్శించారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కనిగిరి నియోజకవర్గంలో ఎక్సైజ్ సీఐ లేరని, అధిక ధరలు అమ్ముకునేందుకు తనకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని..ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని సభ దృష్టికి తెచ్చారు. అధిక ధరల విషయమై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు, అసిస్టెంట్ కమిషనర్‌కు, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, నచ్చని వారి మద్యం షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావుకు అంతా తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
విద్యుత్తు శాఖలోని షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల నియామకాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకుల చెప్పు చేతల్లో విద్యుత్తు శాఖాధికారులు, కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎ.జయకుమార్ జిల్లాలో అవలంబిస్తున్న కొత్త పథకాలు, విద్యుత్తు లేని ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు విద్యుత్తు సరఫరా వివరాలను తెలియజేశారు. ఆదాయం రావటం లేదన్న కనిగిరికి చెందిన ఎక్సైజ్ అధికారిపై విచారణ చేపట్టి త్వరలో నివేదిక అందజేయాలని ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.భాస్కరరావును కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎమ్మార్పీకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, బెల్టు షాపులు నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా లేకుండా చేయాలని ఆదేశించారు.
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లను ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ మద్యం షాపులు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెంలో విద్యుత్తు సమస్య ఎక్కువగా ఉందని, నియోజకవర్గంలో 70 చెంచుగూడేలు విద్యుత్ లేక అంధకారంలో ఉన్నాయన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మద్యం షాపులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పొదిలిలో మద్యం షాపు యజమానులందరూ సిండికేటై మద్యం ధరలను పెంచేందుకు దోహదపడ్డారన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని, ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున అధికార పార్టీ నాయకులు తీసుకున్నారన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని నాలుగు సబ్‌స్టేషన్లు నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇంత వరకు ఒకటి కూడా ప్రారంభించలేదన్నారు.
బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పని చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం అధికంగా ఉందన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ మద్యం విధానంలో ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సిందేనని బెల్టు షాపులను నిర్మూలించాల్సిందేనని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అధికారులు కూడా పారదర్శకంగానే వ్యవహరిస్తున్నారని, ఆర్‌ఓఆర్‌ను పాటిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల జోక్యం ఎక్కడా లేదన్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటున్నారని, ఇప్పటి వరకు జరిగిన నియామకాలన్నింటినీ రద్దు చేసి నూతన నియామకాలకు అందరూ సహకరించాలని ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పని చేస్తున్న వారినందరినీ తీసేస్తే మొత్తాన్ని టీడీపీ కార్యకర్తలతో నింపేయాలని చూస్తున్నారా అని ఎదురుతిరిగారు.
ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యేల ధ్వజం
Published Fri, Jan 9 2015 4:50 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement