బీసీల్లో రెట్టించిన ఉత్సాహం | Excitement has been doubled in BCs With YS Jagan BC declaration | Sakshi
Sakshi News home page

బీసీల్లో రెట్టించిన ఉత్సాహం

Published Mon, Feb 18 2019 3:08 AM | Last Updated on Mon, Feb 18 2019 3:08 AM

Excitement has been doubled in BCs With YS Jagan BC declaration - Sakshi

అమర జవానులకు నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్, ఆర్‌.కృష్ణయ్య, పార్టీ నేతలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటివరకూ రాష్ట్ర చరిత్రలో ఎవరూ ప్రకటించని విధంగా వరాలు కురిపించిన జగన్‌కు బీసీలు జేజేలు పలికారు. రాష్ట్రంలో అన్ని దారులు ఏలూరు వైపేనా అన్నంతగా బీసీలు బీసీగర్జనకు తరలివచ్చారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు ఉత్తుంగ తరంగమై పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. దీంతో బీసీ గర్జన విజయవంతమైంది. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికే ప్రాంగణం మొత్తం నిండిపోవడమే కాకుండా సభాస్థలికి రెండువైపులా సుమారు ఆరేడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో చాలామంది కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది. ‘జగన్‌ అనే నేను’ అంటూ జగన్‌ ప్రస్తావించగానే సభలో సీఎం, సీఎం అంటూ నినాదాలతో సభ హోరెత్తింది. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాగ్దానాలను ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు.

బీసీల సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు వెచ్చిస్తామని, తొలి ఏడాదిలోనే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. బీసీ కులాలకు మొత్తం 139 కార్పొరేషన్లు ప్రకటిస్తానని, కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించినప్పుడు బీసీల నుంచి మంచి స్పందన లభించింది. బీసీ కులాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమైంది. ప్రైవేటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ పనుల్లో, నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు, బీసీలకు వర్తింప చేస్తామని చెప్పినప్పుడు సభ హోరెత్తింది. బీసీలంటే బలహీన వర్గాలు కాదని బ్యాక్‌బోన్‌ (వెన్నెముక)గా మారుస్తామని ప్రకటించడంతో బీసీల నుంచి మంచి స్పందన లభించింది. వచ్చే ఎమ్మెల్సీ సీటును జంగా కృష్ణమూర్తికి ఇస్తామని ప్రకటించారు. తన ప్రసంగంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే తాను చేయదలచుకున్న పనులను వివరించడం పట్ల సభికుల్లో మంచి స్పందన వ్యక్తమైంది.

అమర వీరులకు నివాళి
సభ ప్రారంభానికి ముందు జమ్ముకాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన అమర జవానులకు సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. తొలుత మహాత్మా జ్యోతీబా పూలే, సావిత్రీబాయి పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఆళ్ల నాని, తలశిల రఘురామ్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, విడుదల రజని, నర్సిగౌడ్, ఉషాచరణ్, మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు, జయరాములు, అనిల్‌కుమార్‌ యాదవ్, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, బీసీ విభాగం నేతలు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం
విమానాశ్రయం (గన్నవరం): ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఏలూరులో బీసీ గర్జనలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌ నుంచి ఇండిగో విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్‌ను పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మహ్మద్‌ ముస్తాఫా, ఎమ్మెల్సీలు ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి, మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధులు పేర్ని నాని, జోగి రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, గుంటూరు, విజయవాడ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, బాపట్ల పార్లమెంట్‌ సమన్వయకర్త నందిగం సురేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు యార్లగడ్డ వెంకట్రావు, సింహాద్రి రమేష్‌బాబు, కైలే అనిల్‌కుమార్, అన్నాబత్తుని శివకుమార్‌ ఉన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ 

విమానాశ్రయం నుంచి వైఎస్‌ జగన్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. తొలుత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆయనను కలిసి కొద్దిసేపు చర్చించారు. బీసీ సంఘ నాయకులు జగన్‌కు గొర్రె పిల్లను బహూకరించారు. అదేవిధంగా పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నరసరావుపేట, రాజమండ్రి పార్లమెంట్‌ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గని భరత్‌రామ్, పార్టీ రాష్ట్ర నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, బత్తిన ట్రాన్స్‌పోర్టు అధినేత బత్తిన రాము తదితరులు కలిశారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గం ద్వారా ఏలూరు వెళ్లారు. కాగా, ఏలూరులో బీసీ గర్జన బహిరంగ సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఆయన రాత్రి 7.40 గంటలకు గన్నవరం చేరుకున్నారు. అనంతరం 7.55కు విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల నాని, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, కైలే జ్ఞానమణి తదితరులు వీడ్కోలు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement