వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక | YS Jagan Comments In the BC Garjana | Sakshi
Sakshi News home page

వెనుకబడిన తరగతులే దేశానికి వెన్నెముక

Published Mon, Feb 18 2019 2:37 AM | Last Updated on Mon, Feb 18 2019 7:26 PM

YS Jagan Comments In the BC Garjana - Sakshi

జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే విగ్రçహాలకు నివాళులు అర్పిస్తున్న వైఎస్‌ జగన్‌

బీసీలంటే  బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి  కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్‌ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రులకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.     
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

ఏలూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన తరగతులకు మాయమాటలు చెప్పిదే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా వారిని దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం ఏలూరులో ‘బీసీ గర్జన’ సభలో మాట్లాడారు. బీసీల ముఖాల్లో వెలుగులు చూడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్నివేళలా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దక్కబోయే ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి కట్టబెడతామని ప్రకటించారు. జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘బీసీలంటే  బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, మీరు భారతదేశం కల్చర్‌ను వేలాది సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులు. మీరంతా వెనుకబడ్డ కులాలు కాదు, మీరు మన జాతికి వెన్నుముక లాంటి  కులాలు. మనం వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి తినే ఆహారం, ఉపయోగించే ప్రతి పనిముట్టు, నివసించే ఇల్లు, ప్రయాణించే బండి, నీరు తాగే గ్లాస్‌ నుంచి అన్నం తినే కంచం వరకు, మన ఇంటి పెరట్లో తవ్విన బావి నుంచి ఇంటికి ఉపయోగించిన ఇటుక వరకు, మన బట్టలకు పట్టిన మకిలిని వదిలించడం దగ్గర నుంచి మన వెంట్రుకలకు సంస్కారం నేర్పడం వరకు.. ఇలా చెప్పుకుంటే పోతే మన ప్రతి అణువులో వేల సంవత్సరాల పాటు బీసీ కులాల పాత్ర ఎంతటి గొప్పదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి బీసీ సోదరుడికి మనం రుణపడి ఉండాల్సిందే. భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం, అగ్గిపెట్టెలో పట్టే చీర, మంగళకరమైన సన్నాయి.. ఏది చూసినా, ఏది విన్నా ఇదంతా మన బీసీల గొప్పతనమే. 

గర్వంగా తలెత్తుకుని జీవించాలి  
నాగరికతకు నడకలు నేర్పిన బీసీల బతుకులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మనసుతో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వీరి బతుకుల్లో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేయగలుగుతామో ఆలోచించాలి. అభివృద్ధి, ఆదాయం పరంగా మన సమాజంలో ఈనాటికీ చాలామంది వెనుకబడి ఉన్నారు. బడుగులు, బలహీనులు ఈ ప్రపంచంలో గర్వంగా తలెత్తుకుని జీవించాలంటే ఉన్నతమైన చదువులు నేర్చుకోవాలి. పదవుల్లో వారికి వాటా కావాలి. 

చంద్రబాబు దగా చేశాడు 
2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో, ప్రణాళిక అంటూ ఒక పుస్తకం చూపించాడు. ఇందులో బీసీ కులాలకు సంబంధించిన 119 వాగ్దానాలు చేశాడు. వాటిలో ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిన పాపానపోలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే చాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వస్తుందని తెలిసినా ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆయనకు మనసు రాలేదు. రాష్ట్రంలో ఏది చూసినా కాంట్రాక్టు అంటాడు, ఔట్‌సోర్సింగ్‌ అంటాడు.

వాటిలో రిజర్వేషన్లు ఉండవు. అంటే బీసీలను చంద్రబాబు దగా చేశాడు. బీసీల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో అక్షరాలా రూ.50 వేల కోట్లు ఇస్తానన్న ఈ పెద్దమనిషి చివరకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చి దారుణంగా మోసం చేశాడు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరు గారుస్తోంది. ఇవాళ మన పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకోవాలంటే అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆస్తులు ఆమ్ముకోవాల్సి వస్తోంది. అరకొరగా ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కూడా చంద్రబాబు బకాయిలు పెట్టాడు. మొత్తం రూ.2,200 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ట్రిపుల్‌ ఐటీ కోర్సులు పూర్తి చేసినా పట్టాలు తీసుకోలేని పరిస్థితి దాపురించిందని చంద్రబాబు నాయుడి పాంప్లెట్‌ పేపర్‌లోనే వచ్చింది. కొత్త భూకేటాయింపుల సంగతి దేవుడెరుగు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల నుంచి ఎన్ని లక్షల ఎకరాల భూములు లాక్కున్నాడో అడగండి. బలహీన వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కోవడానికి నీకు మనసెలా వచ్చింది చంద్రబాబూ అని నిలదీయండి. 

బీసీలను ప్రోత్సహించాలి 
రాజ్యాంగపరమైన పదవులు బీసీలకు ఎప్పుడో ఒకసారి వస్తాయి. అవి లక్ష మందిలో ఏ ఒక్కరికో రావొచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెనుకబడిన తరగతులను ప్రోత్సహించాలి. చేతనైతే సాయం చేయాలి. కానీ, చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జీలుగా అవకాశం వస్తే వారిని అసమర్థులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించి ఆ పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను జస్టిస్‌ ఈశ్వరయ్య మీడియాకు చూపిస్తూ చంద్రబాబు నైజం గురించి చెప్పారు. చంద్రబాబుకు బీసీలపై ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం. బీసీల పట్ల తాను చేసింది తప్పు అని చంద్రబాబు ఈ రోజుకీ ఒప్పుకోవడం లేదు. 

వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి
బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కింద కాదు. బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ అనే పరిస్థితి నుంచి బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. బీసీలను కరివేపాకుల్లా వాడుకున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించండి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశమివ్వండి. నవరత్నాల గురించి ఇంతకు ముందు చెప్పా. ఆ నవరత్నాలతో పేదవారి జీవితాలు మారుతాయని గట్టిగా నమ్ముతున్నా. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికీ తీసుకొస్తా. ప్రతిపేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తా. అది జరగాలంటే మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement