పలు వస్తువులు, సేవలకు మినహాయింపు  | Exemption For Some Goods In Andhra Pradesh Government Due To Lockdown | Sakshi
Sakshi News home page

పలు వస్తువులు, సేవలకు మినహాయింపు 

Published Fri, Mar 27 2020 5:16 AM | Last Updated on Fri, Mar 27 2020 5:18 AM

Exemption For Some Goods In Andhra Pradesh Government Due To Lockdown - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువుల సరఫరా, సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆయా ఉత్పత్తులు, సేవలను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, శాంతిభద్రతల అధికారులను ఆదేశించారు.

అధికార యంత్రాంగం విధులివీ.. 
►సూపర్‌ మార్కెట్లు, అక్కడి నుండి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, కిరాణా దుకాణాలకు వస్తువులు సరఫరా అయ్యేలా చూడడం. 
►ప్రజలకు అవసరమైన వస్తువులను హోం డెలివరీ చేసేలా సూపర్‌ మార్కెట్లను ప్రోత్సహించడం. 
►సేవల బాధ్యతను చూసేందుకు జిల్లా, నగర, పట్టణ, మండల, పంచాయతీ, వార్డు స్థాయి కమిటీలు ఉంటాయి. ఒక్కో బాధ్యుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో వస్తువుల సరఫరా, రవాణా ఉంటుంది. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహిస్తారో ఖరారైంది.   
►ప్రతి కిరాణా షాపును విధిగా ఆన్‌లైన్‌లో ట్యాగ్‌ చేసి ఎలా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించాలి. రెండు మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రతి ప్రాంతానికి ఒక స్టోర్‌ ఉండేలా చూడాలి. 
►ఎక్కువ ప్రాంతాల్లో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. సరుకులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా, ధరలు పెరగకుండా చూడాలి. 
►డెయిరీ, పాల కేంద్రాల ద్వారా నిత్యం పాల పాకెట్లు సరఫరా అయ్యేలా చూడాలి. 
►శానిటైజర్లు, మాస్క్‌లు మామూలు ధరల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.   
►నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. 
►చెక్‌ పోస్టుల వద్ద ఈ తరహా వాహనాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే 1902కు ఫోన్‌ చేయొచ్చు.

వీటి సరఫరా సవ్యంగా సాగాలి 
►తాగునీరు, వాటర్‌ ట్యాంకర్లు, కూరగాయలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, మాంసం, చేపలు, కిరాణా సామగ్రి (పచారి సామాన్లు), బ్రెడ్, బిస్కెట్లు, బియ్యం, పప్పులు, ఆయిల్‌ మిల్లులు. 
►ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్‌ దుకాణాలు, అన్ని గోడౌన్ల నుండి ఆహార ధాన్యాల లోడ్, అన్‌లోడ్‌.. పశుగ్రాసం, ఆక్వా ఫీడ్, ఇతరత్రా పదార్థాలు. 
►బల్క్‌ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాణాల్ని కాపాడే మందులు, మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలు, మెడికల్‌ షాపులు, పశువైద్య సేవలు. 
►పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ, సీఎఎన్‌జీ గ్యాస్, ఫర్నేస్‌ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్‌ఎస్, హెచ్‌ఎస్, ఏవియేషన్‌ ఫ్యూయల్, ఇథనాల్‌ తదితరాలు. 
►ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, మరమ్మతులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బీమా సంస్థలు. 
►ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, కూరగాయలు, పండ్ల సేకరణ, నిల్వ, పంటల్ని కప్పి ఉంచేందుకు అవసరమైన టార్పాలిన్లు, గోతాలు, పాలిథిన్, డబ్బాలు తదితరాలు. 
►అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌.. తదితర ఇ–కామర్స్‌ సంస్థలు అందించే సేవలు, ఆహార వస్తువుల సరఫరా. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement