
డబుల్ డెక్కర్ వచ్చేనా?
ఇదొక్కటే ఆశ
కొత్త రైళ్లపై దృష్టి పెట్టని
ప్రజాప్రతినిధులు
అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం లభించేనా?
నేడు రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, విజయవాడ :
రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో విజయవాడకు కొత్త రైళ్లు వచ్చే సూచనలు కనపడటం లేదు. విజయవాడ మీదుగా వెళ్లేలా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు కావాలని రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి ప్రతిపాదించారు. ఇదొక్కటే 2014-15 సంవత్సరానికి గాను బుధవారం ప్రవేశపెట్టే రైల్వే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆమోదం పొందే అవకాశం కనపడుతోంది. మిగిలిన రైళ్లు ఏవీ వచ్చే పరిస్థితి కనపడటం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ప్రజాప్రతినిధుల నుంచి ఒక్క ప్రతిపాదనా లేదు...
సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుండటంతో రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఎంపీలు గాని దృష్టి పెట్టలేదు. వారి నుంచి ఈ ఏడాది ఒక్క ప్రతిపాదన కూడా రైల్వేకు వెళ్లలేదు. పైగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు వచ్చే అవకాశాలు లేవు. కొత్త రైళ్లు, స్టేషన్లలో వసతులకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రకటిస్తామని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున కార్గే ప్రకటించారు. విజయవాడ డివిజన్ నుంచి కొత్త రైళ్ల కోసం గత నెలలో రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. అవి వచ్చే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో చోటు దక్కించుకుంటాయో లేదో చూడాలి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి రెండు వైపులా రాత్రిపూట రైలు నడపాలని, విజయవాడ నుంచి గౌహతికి వారానికోసారి నడుపుతున్న ఎక్స్‌ప్రెస్‌ని ప్రతిరోజూ నడపాలని, కాకినాడ నుంచి యశ్వంత్‌పూర్, గుంటూరు నుంచి ధర్మవరం, మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ , అమరావతి - విజయవాడ రైళ్లను కూడా రోజూ నడపాలని ప్రతిపాదనలు పంపారు. రాజస్థాన్, గుజరాత్, ముంబై, కోయంబత్తూరు, మంగుళూరు, సేలం తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు కావాలనే ఈ ప్రాంత ప్రయాణికుల డిమాండ్ నెరవేరడం లేదు. గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య సర్క్యులర్ రైళ్ల ఏర్పాటుకు ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. వీటిలో కొన్నింటికైనా ఆమో దం దొరకాలని అధికారులు ఆశిస్తున్నారు.