కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో గుట్టలుగా ఉన్న మందులు, కాల పరిమితి తీరిన సిరప్
కర్నూలు(హాస్పిటల్): ఔషధాలు అక్కరకు రాకుండా పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా రూ.4 కోట్ల విలువైన మందులు కాలం తీరిపోయి (ఎక్స్‌పైరీ) వృథాగా పడివున్నాయి. వీటిని కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో గుట్టలుగుట్టలుగా పడేశారు. ప్రభుత్వ అడ్డగోలుతనం, ఉన్నతాధికారుల కమీషన్ల వ్యవహారానికి ఇవి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాలుగేళ్లుగా డిమాండ్‌కు మించి పంపుతుండడం, ఇదే తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులు డిమాండ్‌కు మించి తీసుకోలేకపోతుండడంతో మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో పేరుకుపోయాయి. కాలం తీరిన వీటిని నాశనం చేసేందుకు అధికారులు ఇప్పుడు ఓ కమిటీ వేయడం గమనార్హం.
జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, ఆదోనిలో ఎంసీహెచ్ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రితో పాటు 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 40కి పైగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఏటా కర్నూలు సర్వజన వైద్యశాలకు ఒక్క దానికే రూ.4 కోట్లు, మిగిలిన ఆసుపత్రులకు రూ.4 కోట్ల విలువైన మందులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా మందులు, సర్జికల్స్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లకు పంపిస్తోంది.
అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వాహనంలో తరలిస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ–ఔషధి విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, సర్జికల్స్ ఇండెంట్‌ను వారు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పెడుతూ ఉండాలి. ఆయా ఆసుపత్రుల డిమాండ్‌ను బట్టి మందులను కేటాయిస్తూ ఉంటారు. ఏ ఆసుపత్రికి ఎంత డిమాండ్ ఉందనే విషయం ఉన్నతాధికారులకు తప్ప సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు కూడా సరైన సమాచారం ఉండదు. ఈ మేరకు రాజధాని ప్రాంతం నుంచే మందులను ఉన్నతాధికారులు కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు.
అవసరానికి మించి కొనుగోలు
రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014లో మూడు నెలల ఇండెంట్‌కు బదులు తొమ్మిది నెలల మందులను ఒకేసారి పంపించారు. అప్పటి నుంచి అధిక శాతం మందులను కొనుగోలు చేసి పంపిస్తూనే ఉన్నారు. వీటిని పెట్టేందుకు అవసరమైన స్థలం లేక ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ కార్యాలయంలోని అధికారుల గదుల్లోనూ ఉంచారు. ఇటీవల ఎన్‌ఎస్, ఆర్‌సీ సెలైన్ బాటిళ్లు జిల్లాకు మూడు నెలలకు సంబంధించి 34,000 డిమాండ్ ఉండగా.. ప్రభుత్వం ఏకంగా లక్షకు పైగా పంపింది. ఇలా వచ్చిన మందుల్లో అధిక శాతం కాలపరిమితికి దగ్గరగా ఉన్నవే కావడం గమనార్హం.
కాలపరిమితి తీరిన మందుల విలువ రూ.4 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నాలుగేళ్లుగా కమీషన్లకు ఆశపడుతూ కొనుగోలు చేసిన మందుల్లో అధిక శాతం వినియోగం కాకపోవడంతో కాలం తీరిపోయాయి. ఇందులో బి.కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, డైక్లోఫెనాక్, పారాసిటమాల్, సీపీఎం, ప్యాంటిడిన్, పాంటాప్రోజోల్ లాంటి 120 రకాల నిత్యావసర మందులూ ఉన్నాయి. ప్రస్తుతం ఇవే మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రంగా ఉండటం గమనార్హం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే ఆ మందులను నాశనం చేయాలని జిల్లా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో మందులను ఎలా నాశనం చేయాలనే విషయమై కమిటీ వేశారు. ఇకపోతే పీహెచ్‌సీలకు పంపిన మందుల్లో కాలపరిమితి తీరిన వాటిని అక్కడే నాశనం చేస్తున్నారు.
మందులను నాశనం చేసేందుకు కమిటీ
కొన్నేళ్లుగా కాలపరిమితి తీరిన మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటిని నాశనం చేసేందుకు నాతో పాటు డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో, నంద్యాల డీసీహెచ్‌లతో కమిటీ వేశాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం పంపించాం. –విజయభాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment