Expiry Medicine
-
జాండిస్ వచ్చిందని వెళితే.. గడువుతీరిన సెలైన్ బాటిల్‌తో..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిది రోజుల బాబుకు జాండీస్ వచ్చాయని తల్లిడండ్రులు నర్సంపేటలోని తనుష పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాబును పరీక్షించి ఫోటో తెరఫి బాక్సులో ఉంచి సెలైన్ పెట్టమని వైద్యుడు జాన్సన్ సిబ్బందికి చెప్పారు. కాసేపటి తరువాత తల్లిదండ్రులు చూసే సరికి గడువుతీరిన సెలైన్ బాటిల్‌ను బాబుకి ఎక్కిస్తున్నట్టు గమనించారు. అయితే అప్పటికే బాబు పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో ఆ తల్లిదండ్రులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ బాబుని కోల్పోయామని మండిపడుతూ గొడవకు దిగారు. చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై.. -
గల్ఫ్ దేశాలకు నిషేధిత మందుల సరఫరా
గల్ఫ్ వెళ్తున్న అమాయకులను మాయ చేస్తున్నారు. నిషేధిత మందులను వారి చేతిలో పెట్టి విమానం ఎక్కిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో చిక్కి అమాయకులు బలి అవుతున్నారు. ఈ మందుల మాఫియాపై పోరుబాటకు శ్రీకారం చుట్టింది గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక. మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన ఎన్నో రకాల మందులను రవాణా చేయించిన మందుల మాఫియా సభ్యులు సురక్షితంగా ఉండగా అమాయకులు మాత్రం బలి పశువులవుతున్నారు. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గల్ఫ్ దేశాల్లోని పలు తెలుగు స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కొందరు తెలంగాణ వలస కార్మికులు ఇటీవల జైళ్ల నుంచి విడుదలై ఇళ్లకు చేరుకోగా మరి కొందరు మాత్రం మాతృభూమికి రాలేక గల్ఫ్ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అమాయకులతో ఆటలాడుకున్న మందుల మాఫియా ముఠా భరతం పట్టి వారి ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నడుం బిగించింది. దుబాయ్‌లోని అల్ అవీర్ జైలులో మూడేళ్ల పది నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై ఇంటికి వచ్చిన ఏర్గట్ల మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ దయనీయ స్థితిని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక గుర్తించింది. పూసల శ్రీనివాస్ మంచితనానికి పోయి జైలు పాలుకావడం వెనుక మందుల మాఫియా ముఠా హస్తం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మందుల మాఫియా ధనదాహానికి పూసల శ్రీనివాస్ బలై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక వేదనకు గురయ్యాడని, కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఆ కుటుంబంపై ఆధారపడి రావడం దురదృష్టకరమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఠా సభ్యుల ఇంటివద్ద.. పూసల శ్రీనివాస్‌కు, అతని కుటుంబానికి జరిగిన నష్టానికి మందుల మాఫియా ముఠా సభ్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్ దుబాయ్‌కు వెళ్లే ముందు అతనికి టిక్కెట్ విక్రయించిన ట్రావెల్ ఏజెంటు మందుల ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చిన్నాన్న వచ్చి మందుల పార్శిల్‌ను తీసుకుంటాడని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. కాని దుబాయ్ ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసు అధికారులు శ్రీనివాస్ వద్ద ఉన్న మందుల పార్శిల్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ కోర్టులో హాజరైన తర్వాత కోర్టుకు శ్రీనివాస్ జరిగిన వాస్తవాన్ని వివరించాడు. మందుల పార్శిల్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆ పార్శిల్ తనదే అంటే శ్రీనివాస్‌ను కోర్టు విడుదల చేసే అవకాశం ఉండేది. కాని మందుల పార్శిల్‌ను తీసుకోవాల్సిన వ్యక్తి శ్రీనివాస్ అరెస్టు విషయాన్ని తెలుసుకుని మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మందుల పార్శిల్‌కు సంబంధించిన ఏదైనా కేసు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చినా శ్రీనివాస్‌ను విడుదల చేస్తామని దుబాయ్ కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇచ్చారు. కాని మందుల పార్శిల్‌కు సంబంధించి శ్రీనివాస్ పట్టుబడిన తర్వాత అసలు దోషులు ఎవరు కూడా పోలీసులకు చిక్కలేదు. ఫలితంగా జైలు శిక్ష అనుభవించాలని దుబాయ్ కోర్టు తీర్పు చెప్పింది. శ్రీనివాస్ లాంటి ఎంతో మంది తెలంగాణ కార్మికులు నిషేధిత మందులపై అవగాహన లేక మాఫియా ముఠా ఉచ్చులో చిక్కుకుని గల్ఫ్ దేశాలకు వాటిని తీసుకెళ్లి జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మందుల మాఫియా ముఠాపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి బాధితులైన వారికి న్యాయం జరిగేలా చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. సంబంధం లేని నేరానికి.. మందుల పార్శిల్ తీసుకవెళ్లాలని మోర్తాడ్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ మహేశ్ బతిమిలాడాడు. మానవత్వంతోనే మందుల పార్శిల్‌ను తీసుకవెళ్లాను. ఎయిర్‌పోర్టులో పట్టుబడటంతో శిక్ష పడింది. ఒకవేళ ఎయిర్‌పోర్టు బయట పట్టుబడి ఉంటే జీవితంలో ఇంటికి రాలేక పోయేవాడిని. నాకు సంబంధం లేని నేరానికి జైలులో నరకయాతన అనుభవించాను. – పూసల శ్రీనివాస్, బాధితుడు, తడపాకల్ న్యాయం జరిగే వరకు పోరాడుదాం.. పూసల శ్రీనివాస్‌తో మందుల పార్శిల్ పంపించిన మాఫియా ముఠా అతనికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. మందుల మాఫియా ముఠాపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. బాధితుడు శ్రీనివాస్ కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకు ఉద్యమంను కొనసాగిస్తాం. – కృష్ణ దొనికెన, వ్యవస్థాపక అధ్యక్షుడు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక -
రోగుల ప్రాణాలతో చెలగాటం..
సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లిన మాత్రలు రోగులకిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధి అయిన డయేరియా నివారణకు మెట్రోజోల్ మాత్రలు ఇస్తుంటారు. అయితే ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది అందజేస్తున్నారంటే వారికి రోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కాలం చెల్లిన మాత్రలు పీహెచ్‌సీల్లో ఉంటే వాటిని కాల్చివేయాలి. కాని సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా రోగులకు ఎక్స్పైరీ అయిన మాత్రలను ఇస్తున్నారు. బలిజిపేట పీహెచ్సీలో డయేరియా రోగులకు కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. 2018 అక్టోబర్ నాటికి ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది ఇచ్చారు. ఇవేమీ తెలియని రోగులు ఆ మాత్రలు మింగేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న రోగులు తమకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా వచ్చే రోగులు పీహెచ్‌సీకి ఎక్కువగా గర్భిణులు, బాలింతలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, సుగర్, బీపీ రోగులు ఎక్కువగా వస్తుంటారు. వీరితో పాటు డయేరియా, వైరల్ జ్వరాల బారిన పడ్డవారు కూడా పీహెచ్‌సీని ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు కాలం చెల్లిన మాత్రలు ఇస్తున్నారంటూ బయటకు పొక్కడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇండెంట్ పీహెచ్సీ ఆధారంగా ఇండెంట్ పెడుతుంటారు. పీహెచ్‌సీలకు సంబంధించిన మందులు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి తిరిగి వస్తాయి. బలిజిపేట పీహెచ్‌సీకి మూడు నెలలకొకసారి రూ. 1.50 లక్షలతో ఇండెంట్ పెడతారు. పర్యవేక్షిస్తాం.. బలిజిపేట పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు లేవు. ఒకవేళ ఉంటే అటువంటి వాటిని గుర్తించి పక్కన పెట్టస్తాం. దీనిపై పర్యవేక్షణ జరుపుతాం. – మహీపాల్, వైద్యాధికారి, బలిజిపేట పీహెచ్సీ. -
అక్కరకు రాని ఔషధాలు
కర్నూలు(హాస్పిటల్): ఔషధాలు అక్కరకు రాకుండా పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా రూ.4 కోట్ల విలువైన మందులు కాలం తీరిపోయి (ఎక్స్పైరీ) వృథాగా పడివున్నాయి. వీటిని కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో గుట్టలుగుట్టలుగా పడేశారు. ప్రభుత్వ అడ్డగోలుతనం, ఉన్నతాధికారుల కమీషన్ల వ్యవహారానికి ఇవి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాలుగేళ్లుగా డిమాండ్‌కు మించి పంపుతుండడం, ఇదే తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులు డిమాండ్‌కు మించి తీసుకోలేకపోతుండడంతో మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో పేరుకుపోయాయి. కాలం తీరిన వీటిని నాశనం చేసేందుకు అధికారులు ఇప్పుడు ఓ కమిటీ వేయడం గమనార్హం. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, ఆదోనిలో ఎంసీహెచ్ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రితో పాటు 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 40కి పైగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఏటా కర్నూలు సర్వజన వైద్యశాలకు ఒక్క దానికే రూ.4 కోట్లు, మిగిలిన ఆసుపత్రులకు రూ.4 కోట్ల విలువైన మందులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా మందులు, సర్జికల్స్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు పంపిస్తోంది. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వాహనంలో తరలిస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ–ఔషధి విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, సర్జికల్స్ ఇండెంట్‌ను వారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి పెడుతూ ఉండాలి. ఆయా ఆసుపత్రుల డిమాండ్‌ను బట్టి మందులను కేటాయిస్తూ ఉంటారు. ఏ ఆసుపత్రికి ఎంత డిమాండ్ ఉందనే విషయం ఉన్నతాధికారులకు తప్ప సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు కూడా సరైన సమాచారం ఉండదు. ఈ మేరకు రాజధాని ప్రాంతం నుంచే మందులను ఉన్నతాధికారులు కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014లో మూడు నెలల ఇండెంట్‌కు బదులు తొమ్మిది నెలల మందులను ఒకేసారి పంపించారు. అప్పటి నుంచి అధిక శాతం మందులను కొనుగోలు చేసి పంపిస్తూనే ఉన్నారు. వీటిని పెట్టేందుకు అవసరమైన స్థలం లేక ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ కార్యాలయంలోని అధికారుల గదుల్లోనూ ఉంచారు. ఇటీవల ఎన్ఎస్, ఆర్సీ సెలైన్ బాటిళ్లు జిల్లాకు మూడు నెలలకు సంబంధించి 34,000 డిమాండ్ ఉండగా.. ప్రభుత్వం ఏకంగా లక్షకు పైగా పంపింది. ఇలా వచ్చిన మందుల్లో అధిక శాతం కాలపరిమితికి దగ్గరగా ఉన్నవే కావడం గమనార్హం. కాలపరిమితి తీరిన మందుల విలువ రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నాలుగేళ్లుగా కమీషన్లకు ఆశపడుతూ కొనుగోలు చేసిన మందుల్లో అధిక శాతం వినియోగం కాకపోవడంతో కాలం తీరిపోయాయి. ఇందులో బి.కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, డైక్లోఫెనాక్, పారాసిటమాల్, సీపీఎం, ప్యాంటిడిన్, పాంటాప్రోజోల్ లాంటి 120 రకాల నిత్యావసర మందులూ ఉన్నాయి. ప్రస్తుతం ఇవే మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రంగా ఉండటం గమనార్హం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే ఆ మందులను నాశనం చేయాలని జిల్లా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో మందులను ఎలా నాశనం చేయాలనే విషయమై కమిటీ వేశారు. ఇకపోతే పీహెచ్‌సీలకు పంపిన మందుల్లో కాలపరిమితి తీరిన వాటిని అక్కడే నాశనం చేస్తున్నారు. మందులను నాశనం చేసేందుకు కమిటీ కొన్నేళ్లుగా కాలపరిమితి తీరిన మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటిని నాశనం చేసేందుకు నాతో పాటు డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో, నంద్యాల డీసీహెచ్‌లతో కమిటీ వేశాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం పంపించాం. –విజయభాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ -
జేసీ కాలం చెల్లిన మెడిసిన్: మధు యాష్కీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ భగ్గుమన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటివారు కాలం చెల్లిన (ఎక్స్ పైరీ) మెడిసిన్ లాంటివారు అని యాష్కీ వ్యాఖ్యానించారు. ఇక అధిష్టానం చుట్టూ తిరిగినా రాజ్యసభ టికెట్ రాకపోవడంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటివాళ్లు కాంగ్రెస్ పనైపోయిందని అనడంపై ఆయన తప్పుపట్టారు. జేసీ, లగడపాటిలాంటి వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరు అని ఆయన అన్నారు. జేసీ నమ్మి టికెట్ ఇస్తే ట్రావెల్స్ పెట్టి ప్రజల ప్రాణం తీస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సమైక్యం కోసం రాజీనామా చేశామని చెప్పుకుంటున్న నేతలు రాజ్యసభ సీట్లు ఎందుకు అడుగుతున్నారో సీమాంధ్ర ప్రజలు గమనించాలి ఎంపీ మధుయాష్కీ అన్నారు.