ట్రావెల్ ఏజెంట్ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు, గల్ఫ్ అవగాహన వేదిక ప్రతినిధులు
గల్ఫ్ వెళ్తున్న అమాయకులను మాయ చేస్తున్నారు. నిషేధిత మందులను వారి చేతిలో పెట్టి విమానం ఎక్కిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో చిక్కి అమాయకులు బలి అవుతున్నారు. ఈ మందుల మాఫియాపై పోరుబాటకు శ్రీకారం చుట్టింది గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక.
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన ఎన్నో రకాల మందులను రవాణా చేయించిన మందుల మాఫియా సభ్యులు సురక్షితంగా ఉండగా అమాయకులు మాత్రం బలి పశువులవుతున్నారు. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గల్ఫ్ దేశాల్లోని పలు తెలుగు స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కొందరు తెలంగాణ వలస కార్మికులు ఇటీవల జైళ్ల నుంచి విడుదలై ఇళ్లకు చేరుకోగా మరి కొందరు మాత్రం మాతృభూమికి రాలేక గల్ఫ్ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అమాయకులతో ఆటలాడుకున్న మందుల మాఫియా ముఠా భరతం పట్టి వారి ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నడుం బిగించింది.
దుబాయ్‌లోని అల్ అవీర్ జైలులో మూడేళ్ల పది నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై ఇంటికి వచ్చిన ఏర్గట్ల మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ దయనీయ స్థితిని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక గుర్తించింది. పూసల శ్రీనివాస్ మంచితనానికి పోయి జైలు పాలుకావడం వెనుక మందుల మాఫియా ముఠా హస్తం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మందుల మాఫియా ధనదాహానికి పూసల శ్రీనివాస్ బలై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక వేదనకు గురయ్యాడని, కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఆ కుటుంబంపై ఆధారపడి రావడం దురదృష్టకరమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ముఠా సభ్యుల ఇంటివద్ద..
పూసల శ్రీనివాస్‌కు, అతని కుటుంబానికి జరిగిన నష్టానికి మందుల మాఫియా ముఠా సభ్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్ దుబాయ్‌కు వెళ్లే ముందు అతనికి టిక్కెట్ విక్రయించిన ట్రావెల్ ఏజెంటు మందుల ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చిన్నాన్న వచ్చి మందుల పార్శిల్‌ను తీసుకుంటాడని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. కాని దుబాయ్ ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసు అధికారులు శ్రీనివాస్ వద్ద ఉన్న మందుల పార్శిల్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ కోర్టులో హాజరైన తర్వాత కోర్టుకు శ్రీనివాస్ జరిగిన వాస్తవాన్ని వివరించాడు.
మందుల పార్శిల్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆ పార్శిల్ తనదే అంటే శ్రీనివాస్‌ను కోర్టు విడుదల చేసే అవకాశం ఉండేది. కాని మందుల పార్శిల్‌ను తీసుకోవాల్సిన వ్యక్తి శ్రీనివాస్ అరెస్టు విషయాన్ని తెలుసుకుని మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మందుల పార్శిల్‌కు సంబంధించిన ఏదైనా కేసు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చినా శ్రీనివాస్‌ను విడుదల చేస్తామని దుబాయ్ కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇచ్చారు. కాని మందుల పార్శిల్‌కు సంబంధించి శ్రీనివాస్ పట్టుబడిన తర్వాత అసలు దోషులు ఎవరు కూడా పోలీసులకు చిక్కలేదు.
ఫలితంగా జైలు శిక్ష అనుభవించాలని దుబాయ్ కోర్టు తీర్పు చెప్పింది. శ్రీనివాస్ లాంటి ఎంతో మంది తెలంగాణ కార్మికులు నిషేధిత మందులపై అవగాహన లేక మాఫియా ముఠా ఉచ్చులో చిక్కుకుని గల్ఫ్ దేశాలకు వాటిని తీసుకెళ్లి జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మందుల మాఫియా ముఠాపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి బాధితులైన వారికి న్యాయం జరిగేలా చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.
సంబంధం లేని నేరానికి..
మందుల పార్శిల్ తీసుకవెళ్లాలని మోర్తాడ్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ మహేశ్ బతిమిలాడాడు. మానవత్వంతోనే మందుల పార్శిల్‌ను తీసుకవెళ్లాను. ఎయిర్‌పోర్టులో పట్టుబడటంతో శిక్ష పడింది. ఒకవేళ ఎయిర్‌పోర్టు బయట పట్టుబడి ఉంటే జీవితంలో ఇంటికి రాలేక పోయేవాడిని. నాకు సంబంధం లేని నేరానికి జైలులో నరకయాతన అనుభవించాను. – పూసల శ్రీనివాస్, బాధితుడు, తడపాకల్
న్యాయం జరిగే వరకు పోరాడుదాం..
పూసల శ్రీనివాస్‌తో మందుల పార్శిల్ పంపించిన మాఫియా ముఠా అతనికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. మందుల మాఫియా ముఠాపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. బాధితుడు శ్రీనివాస్ కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకు ఉద్యమంను కొనసాగిస్తాం. – కృష్ణ దొనికెన, వ్యవస్థాపక అధ్యక్షుడు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక
Comments
Please login to add a commentAdd a comment