సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి వారి ఇబ్బందులను పరిష్కరించి భరోసా కల్పించే లక్ష్యంతో ప్రతి జిల్లాకు మూడో జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో అదనంగా 13 జాయింట్ కలెక్టర్ (కేడర్) పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీ పోస్టులను మూడు విభాగాలుగా రీ డిజిగ్నేషన్ చేయడంతోపాటు పర్యవేక్షించాల్సిన విభాగాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. తద్వారా పరిపాలనా వ్యవస్థ జిల్లాల స్థాయిలో బలోపేతం కావడంతోపాటు లోపరహితంగా, శరవేగంగా సేవలు అందనున్నాయి.
అందరి సంక్షేమమే లక్ష్యం..
‘అవినీతికి తావులేని, జవాబుదారీ పరిపాలన అందించడంతోపాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘మిషన్ మోడ్’లో నిర్వహించాలని నిర్ణయించాం. చిట్టచివరి వ్యక్తికి కూడా సత్వర సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను తెచ్చింది. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేల్‌లో పెద్ద స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు కీలక బాధ్యతలు చేపట్టడానికి ముందు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం అవసరం. స్టేట్ సివిల్ సర్వీస్ (ఎస్‌సీఎస్), నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ (నాన్ ఎస్‌సీఎస్) అధికారులు ఐఏఎస్‌లుగా ప్రమోషన్ పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో పనిచేసిన మంచి ట్రాక్ రికార్డు ఉండటం అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూడో జేసీ పోస్టు మంజూరు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
3 విభాగాలుగా జేసీలు
► ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్–1ను జాయింట్ కలెక్టర్– రైతు భరోసా, రెవెన్యూ (ఆర్‌బీ– ఆర్)గా ప్రభుత్వం మార్చింది. ఇందులో సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారిని నియమిస్తారు.
► జేసీ–గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వి, డబ్ల్యూఎస్–డి)ని కొత్తగా సృష్టించారు. దీన్ని సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారితో భర్తీ చేస్తారు.
► ప్రస్తుతం ఉన్న జేసీ–2ను జాయింట్ కలెక్టరు – ఆసరా, సంక్షేమం అని మార్చారు. ఇందులో ఎస్సీఎస్, నాన్ ఎస్సీఎస్ అధికారులను(స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేడర్) నియమించనున్నారు.
జేసీ– ఆసరా–సంక్షేమం (ఏ అండ్ డబ్ల్యూ) (పర్యవేక్షించే విభాగాలు)
► గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఏ –డీడబ్ల్యూఎంఏ)
► అన్ని రకాల సంక్షేమం (మహిళా శిశు సంక్షేమం, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ వెల్ఫేర్, మైనారిటీల సంక్షేమం)
► పరిశ్రమలు – వాణిజ్యం
► దేవదాయ 4 స్కిల్ డెవలప్‌మెంట్.
జేసీ– గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వీ, డబ్ల్యూఎస్–డి) (పర్యవేక్షించే విభాగాలు)
► గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్లు
► పంచాయతీరాజ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
► పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య
► పురపాలక, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం
► మీసేవ– ఆర్టీజీ, ఐటీఈ, సి విభాగాలు
► ఇంధన, జలవనరుల శాఖలు మినహా అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాలు
Comments
Please login to add a commentAdd a comment