
ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల ప్లకార్డులతో జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఏపీలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాల కల్పనపై జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రశంసించారు. నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు ఈ–ఆటోలు అందించడం, వాటికి డ్రైవర్లుగా మహిళలనే నియమించడంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం అభినందనలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల ‘హై లెవెల్ పొలిటికల్ ఫోరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టెన్టివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ రాష్ట్రం తరఫున ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ‘నాడు–నేడు’ కింద అమలు చేస్తున్న పలు పథకాలు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, సస్టెయినబుల్ గ్రీన్ సిటీస్ నిర్మాణం గురించి వివరిస్తూ ఫొటోలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ చెత్త సేకరణ కోసం ఈ–ఆటోలు అందించడంతోపాటు డ్రైవర్లుగా మహిళలనే నియమించడం, పట్టణ పేద మహిళలకు రూపాయికే ఇల్లు అందించడం వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇంటింటి చెత్త సేకరణ, పట్టణాల్లో సామాజిక అడవులు, రహదారుల వెంబడి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నట్లు షకిన్‌కుమార్ తెలిపారు. ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారని, క్లీన్ అండ్ గ్రీన్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రూపాయికే ఇల్లు ఇవ్వడాన్ని యూఎన్‌ఓలోని అమెరికా ప్రతినిధి బిల్‌గ్రాహం మెచ్చుకున్నారని తెలిపారు.