ఫేస్‌బుక్‌లో మనకూ ఓ పేజీ | Facebook pages for every organisation | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మనకూ ఓ పేజీ

Published Mon, Jun 23 2014 3:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ఫేస్‌బుక్‌లో మనకూ ఓ పేజీ - Sakshi

ఫేస్‌బుక్‌లో మనకూ ఓ పేజీ

‘ఫేస్‌బుక్’.. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ గురించి తెలియని వాళ్లు అరుదనే చెప్పాలి. టీనేజ్ కుర్రకారు నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి ఇందులో అకౌంట్ ఉంది. ఫేస్‌బుక్ (ఎఫ్‌బీ) ద్వారా ప్రపంచంలో ఏమూలనున్నా టెక్ట్స్ ఛాటింగ్, వీడియో ఛాటింగ్ కనెక్ట్ అయి ఉంటారు. ఇందులో చెప్పుకోదగ్గ మరో అంశం ఫేస్‌బుక్ పేజీ. మనకు ఇష్టమైన అంశం గురించి, వ్యక్తి గురించి, ప్రాంతం గురించి ఇందులో పేజీ తయారు చేసుకొని అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఎఫ్‌బీలో ప్రస్తుతం పేజీ సంస్కృతి బాగా పెరిగిపోయింది. దీనిని ఎఫ్‌బీ వినియోగదారులు బాగానే వినియోగించుకుంటున్నారు. కళాశాలలు, రాజకీయ నేతల పేర్లతో ఉన్న పేజీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
     
ఇవి చాలా స్పెషల్
 
ఇట్స్‌మై చిత్తూర్, తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్, తిరుపతి సిటీ లాంటి పేజీలు జిల్లాలో ఎఫ్‌బీ యూజర్స్‌కు సుపరిచితమే. కొందరు ఔత్సాహికులు వీటిని నిర్వహిస్తూ యూజర్స్‌కు వినోదంతో పాటు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇట్స్ మై చిత్తూర్ పేజీలో చిత్తూరులో రోజూ జరిగే విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు లాంటివి పెడుతుంటారు. దీనికి 11వేల మంది అభిమానులున్నారు. తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్‌కు అత్యధికంగా 2 లక్షల 29 వేల మంది అభిమానులున్నారు. ఈపేజీలో తిరుమల, తిరుపతిలోని దేవాలయాల విశేషాలను పెడుతుంటారు. అలాగే అక్కడ దేవుళ్లకు జరిగే పూజల ఫొటోలను అభిమానులకు అందుబాటులో ఉంచుతుంటా రు. ఇంకా తిరుపతి సిటీ పేజీకి ఐదు వేలమంది పైనే అభిమానులు ఉన్నారు. ఇందులో తిరుపతికి సంబంధించిన విశేషాలు, ఫొటోలను అభిమానుల కోసం పెడుతుంటారు. అలాగే సిటీలో ఏఏ కార్యక్రమాలు జరుగుతాయనే వివరాలను పేజీలో అప్‌డేట్ చేస్తుంటారు. ఇంకా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల పేర్లతోనూ ఔత్సాహికులు పేజీలు నిర్వహిస్తున్నారు.
 
రాజకీయ నేతలకు కూడా..

జిల్లాలోని ప్రముఖ రాజకీయ నేతల పేర్లతో ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. దీని ద్వారా వాళ్లు చేసే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను అభిమానుల కోసం అప్‌డేట్ చేస్తుంటారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆర్‌కే.రోజా, భూమన కరుణాకరరెడ్డి, టీడీపీ చిత్తూరు, కఠారి మోహన్ యూత్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తలారి ఆదిత్య, సత్యప్రభ ఆదికేశవులు ఇలా తదితరుల పేర్లతో పేజీలు ఉన్నాయి. దినపత్రికల్లో వారిపై వచ్చే వార్తా విశేషాలను పేజీలో పెడుతూ అభిమానుల నుంచి లైక్స్ సంపాదిస్తుంటారు.
 
ఎక్కువగా వాడుతోంది కళాశాలలే

ఫేస్‌బుక్‌లో ఎక్కువగా పేజీలు ఓపెన్ చేసి వాడుతోంది జిల్లాలోని కళాశాలలే. దీని యూజర్స్‌గా ఉండే కళాశాల విద్యార్థులు అభిప్రాయాలు పంచుకోవడమే కాకుండా కళాశాల గురించి ప్రచారం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్వీసీఈ), శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్వీసెట్), యోగానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్, శ్రీశ్రీనివాసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సెన్సైస్ (సీతమ్స్) ఇలా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు, శ్రీ వెంకటేశ్వరా వేదిక్ యూనివర్సిటీల పేరుతో ఎఫ్‌బీలో పేజీలు ఉన్నాయి. వీటికి అభిమానులు బాగానే ఉన్నారు. కళాశాలలో జరిగే ఫ్రెషర్స్‌డే, వినూత్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలు పేజీల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. పేజీలకు అభిమానులుగా ఉండే విద్యార్థులు వీటికి లైక్స్ కొడుతూ కామెం ట్స్ చేసుకుంటారు. ఇంకా కళాశాల అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎవర్ని సంప్రదించాలనే వాటిపై ప్రచారం కూడా చేసుకుంటున్నారు. జిల్లాలో పాఠశాలలు, కాలేజీల పేరుతో ఎఫ్‌బీలో చాలా పేజీలు ఉన్నాయి.
 
విద్యాశాఖకు ఓ పేజీ

జిల్లా విద్యాశాఖ ఎఫ్‌బీలో ఓ పేజీ తయారు చేసుకుంది. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించే ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు దీనిని నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వచ్చే ఉత్తర్వులను వెబ్‌సైట్‌తో పాటు పేజీలోనూ పెడుతుంటారు. ప్రస్తుతం టీచర్లలో చాలా మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో ఎఫ్‌బీలో చాలా మందికి అకౌంట్ ఉంది. దీంతో విద్యాశాఖ పేజీ ద్వారా వివరాలు సులువుగానే తెలుసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement