పగలు ప్రచారం.. రాత్రి పందేరం | Fake Campaign In Nellore | Sakshi
Sakshi News home page

పగలు ప్రచారం.. రాత్రి పందేరం

Published Sun, Apr 7 2019 11:47 AM | Last Updated on Sun, Apr 7 2019 11:53 AM

Fake Campaign In Nellore - Sakshi

పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండడంతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. జిల్లాలో బహిరంగంగా ఈ తంతు సాగుతున్నా ఫ్లయింగ్‌స్క్వాడ్, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప దాడులు చేసే పరిస్థితి కనపడడం లేదు. 

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రెండు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 11వతేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ నేతల్లో భయాందోళన నెలకొంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటినుంచే  నియోజకవర్గాల్లో నోట్లకట్టలను, మద్యం, చీరలు, సెల్‌ఫోన్లు తదితరాలను ఓటర్లకు ఎరగావేసి ఓట్లు రాబట్టుకునే పనిలో పడ్డారు.

ముందుగానే ప్రలోభాలు
సాధారణంగా ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్‌ ప్రారంభమయ్యే ముందు వరకు ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతుంది. ప్రచారం గడువు ముగిసిన రోజు రాత్రి,  ఆ పక్కరోజు పంపకాలు సాగుతుంటాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండురోజులే కీలకమైనవి.  ఏజెంట్ల ద్వారా ఓటర్లకు రహస్యంగా నగదు పంపిణీ చేయిస్తుంటారు. ఈ సారి టీడీపీ నాయకులు తమ వ్యూహాలను మార్చుకున్నారు. చివరి రెండురోజుల్లో నిఘా అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా ముందుజాగ్రత్తగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటినుంచే ఓట్ల కొనుగోలు చేస్తున్నారు. 

మూడింతలు పెంచిన వైనం
గతంలో ఒక్కో ఓటుకు రూ. 500 నుంచి రూ.1,000వరకు పంపిణీ చేసేవారు. ఈ ఎన్నికల్లో వాటిని మూడింతలు అవసరమైతే ఐదింతలు చేసేందుకు సైతం టీడీపీ నాయకులు వెనుకాడడం లేదు. ఎన్నికల్లో గెలవాలన్నదే అభ్యర్థుల ముందున్న ప్రధాన అజెండా పెట్టుకోవడంతో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు గడచిన ఐదేళ్లలో తాము సంపాదించిన మొత్తాన్ని ఈ ఎన్నికల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు.

నారాయణ సంస్థల సిబ్బంది కీలకపాత్ర
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి  నారాయణ టీడీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ వైఎస్సార్‌సీపీ తరుçఫున ఎన్నికల బరిలో నిలిచారు. అనిల్‌కుమార్‌యాదవ్‌కు నెల్లూరుసిటీలో మంచి పేరుంది. దీంతోపాటు యూత్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో నారాయణ పక్కా ప్రణాళికతో నగదు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు  పాధాన్యం ఇస్తున్నారు.

టీడీపీ నాయకుల ద్వారా నగదు, తాయిలాలు పంపిణీచేస్తే బయటపడే అవకాశం ఉందని భావించిన ఆయన తన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని రంగంలోకి దించారనే ఆరోపణలున్నాయి.  వారి ద్వారా ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందు నుంచే డివిజన్లవారీగా సర్వేచేయించి ఓటర్ల జాబితాలను సిబ్బందితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. సిబ్బందిని బృందాలుగా విభజించి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్‌లో డబ్బులు పంపిణీ చేసే బాధ్యతలను వారికి అప్పగించారనే విమర్శలున్నాయి.

నిఘా కునుకు
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు మద్యం, నగదు పంపిణీకి అడ్డుకట్టవేస్తామని ఓవైపు ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. అందులో భాగంగా పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయినా మద్యం, నగదు పంపిణీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు తాయిలాలు పంపిణీపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

రూ.1.71కోట్ల స్వాధీనం
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు అధికారులు రూ.1.71కోట్ల నగదు, రూ 1.67కోట్లు విలువజేసే మద్యం, రూ.60వేలు విలువజేసే 40 మొబైల్‌ఫోన్లు, 5,180 చీరలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అభ్యర్థులు మరింత విస్తృతంగా నగదు, మద్యం పంపిణీ చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే ప్రలోభపర్వానికి అడ్డుకట్టవేసే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

చీకట్లో నగదు పంపిణీ!

టీడీపీ నేతలు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వివిధ మార్గాలను ఎంచుకున్నారు. పగలంతా ప్రచారం చేసి చీకటి పడగానే నగదు, తాయిలాల పంపిణీకి సిద్ధమవుతన్నారు. డివిజన్, వార్డు, గ్రామాల వారీగా ఎంత సొమ్ము చేరింది? అక్కడ ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఏ రోజు, ఎన్ని ఇళ్లకు ఎంతమంది ఓటర్లకు వీటిని పంపిణీ చేశారో లెక్కలు రాసుకుంటున్నారు. రాత్రి 11 గంటలు దాటినప్పటి నుంచి తెల్లవారుజాము వరకు నగదు పంపిణీ కొనసాగుతోంది. ముందుగానే టీడీపీ నాయకులు డ్వాక్రామహిళలు, ఫించన్‌ లబ్ధిదారులతో పాటు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వ లబ్ధిపొందిన వారి జాబితాలను సేకరించి వాటి ఆధారంగా నగదు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. 

పోలీసు అదుపులో ‘నారాయణ’ సిబ్బంది

మార్చి 24వ తేదీన నగరంలోని 43వ డివిజన్‌ కుమ్మరవీధి, జెండావీధిలో నారాయణ విద్యాసంస్థలకు చెందిన ఏజీఎం రమణారెడ్డి నగదు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. అతని వద్దనుంచి రూ. 8.30 లక్షల స్వాధీనం చేసుకున్నారు.  

మార్చిలోనే నారాయణ  విద్యాసంస్థల్లో అధ్యాపకునిగా పనిచేస్తున్న బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదుతో ఉండగా ఫ్లయింగ్‌స్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. సిబ్బంది ఇద్దరిపై చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

తాజాగా గురువారం అర్ధరాత్రి బాలాజీనగర్‌ గౌడ్‌హాస్టల్‌ సెంటర్‌ సమీపంలో నివాసం ఉంటున్న నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన రూ. 10.36లక్షలను, ఓటర్ల జాబితాలను, స్లిప్‌లను ఫ్‌లైయింగ్‌స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వరుసగా నారాయణ విద్యాసంస్థల సిబ్బంది మూడుసార్లు పట్టుబడడం బట్టి ఏస్థాయిలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు నారాయణ పన్నాగం పన్నాడో ఇట్టే అర్థమవుతోందని నగర వాసులు చర్చించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement