తెలుగుదేశం పార్టీ నేతలు సచ్ఛీలురని, తాను నిప్పు, నిజాయతీ పరుడనని చంద్రబాబు చెబుతుంటాడు. కానీ ఆయన తన పార్టీ తరఫున జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల బరిలో అవినీతి పరులు, మోసగాళ్లు, రౌడీయిజం చెలాయించే వాళ్లకే టికెట్లు ఇచ్చి నిలబెట్టారు. వీరిలో ప్రైవేట్ వ్యక్తుల భూముల కబ్జాలు, వెంచర్ల పేరుతో రూ.కోట్లు కాజేసి చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదైన ఒక అభ్యర్థి ఉండగా, ఇంకో అభ్యర్థిపై అవినీతి, అక్రమాలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మరో అభ్యర్థి అయితే రౌడీయిజం చెలాయిస్తూ వివాదాస్పదుడిగా చరిత్రకెక్కారు. మచ్చలేని, అవినీతి లేని నేతలకే టికెట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసభలో ఊదరగొడుతున్నాడు. మరి ఈ నేతలకు టికెట్లు ఇవ్వడంపై ఆయన ఎంతటి నిప్పో అర్థమవుతోంది.
సాక్షి, నెల్లూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి నేరచరితులు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రధానంగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపైనే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అధికార పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. అందరూ ఈ ఐదేళ్లు అనేక పథకాలు, పనుల పేరుతో కమీషన్లగా వందల రూ.కోట్లు దోచుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు చేసిన పనులు చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రలోభాలు, తాయిలాలపైనే అధారపడి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులపైకేసులు నమోదైనట్లు వారే ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరి కొంత మందిపై కేసుల నమోదు కాకపోయినా వివాదాస్పద వైఖరి, అడ్డగోలు వ్యవహరాలు మాత్రం లెక్కకు మించి ఉన్నాయి.
జిల్లాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి మళ్లీ టికెట్లు దక్కించుకున్న ఉదయగిరి, కోవూరు టీడీపీ అభ్యర్థులు బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై కేసులు లేనప్పటికి తరచూ వివాదాస్పద వైఖరి, కాంట్రాక్టర్లను బెదిరింపుల్లో నిత్యం హల్‌చల్ చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన అనేక మంది నేతలు వివాదాలు, భూదందాలతో నిన్నటి వరకు హడావుడి చేసిన వారే. అయితే అధికారం చేతిలో ఉండటంతో ఎన్ని అరాచకాలు చేసిన ఎక్కడా కేసులు నమోదు కాని పరిస్థితి. జిల్లాలో సీఎం చంద్రబాబు మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈక్రమంలో అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వ్యవహార శైలిపైన చర్చ సాగుతోంది. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడుల్లా పదేపదే మచ్చలేని పాలన అందించే నేతలు అంటూ కొనియాడుతుంటారు కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.
రియల్ కేసుల్లో పోలంరెడ్డి
కోవూరు టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థానికంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధి హోదాలో కాంట్రాక్ట్ వర్కులు నిర్వహిస్తూ అందినంత మేరకు గడిచిన ఐదేళ్లలో భారీగా దండుకున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కేసులకు సంబంధించి వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పోలంరెడ్డిపై తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి.
ఉస్మానియా యూనివర్సిటీ, హబ్సిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నంబర్ 287/13 నమోదైంది. ఈ కేసు పోలంరెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీకి, కొనుగోలుదారులకు మధ్య ఉంది. నాంపల్లి అడిషనల్ చీఫ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్–463/14గా కేసు జరుగుతోంవది. సెక్షన్ 406, 420 కింద కేసులు ఉన్నాయి. కేసు నంబర్ 40/2015తో ఘట్‌కేసర్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీసీ నంబర్ 396/16 ఎల్‌బీ నగర్ కోర్టులో సెక్షన్ 465 ,418, 420, 423, 663, 468 కింద కేసులు నమోదయ్యాయి. కేసు నంబర్ 457/2017తో ఘట్‌కేసర్‌లో నమోదైందని కేసు సీసీ నంబర్ 4075/18 కింద ఎల్‌బీ నగర్ కోర్టులో నడుస్తోంది. సెక్షన్ 120(బీ), 406, 464, 506, రెడ్‌విత్ 420 కింద నమోదైంది.
బడా కాంట్రాక్టర్‌గా చీటింగ్ కేసుల్లో బొల్లినేని
ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చీటింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏసీబీ కేసు కూడా ఉండటం గమనార్హం. స్థానికంగా నేతలకు అందుబాటులో ఉండకపోవటంతో పాటు ఫైబర్ చెక్‌డ్యాంల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పసుపు కుంభకోణంలోనూ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీ నేతలపైనే కేసులు నమోదయ్యాయి తరచూ స్థానికంగా వివాదాస్పద వైఖరితోనే బొల్లినేని రాజకీయం చేస్తుంటారు. ప్రధానంగా రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. బొల్లినిని రామారావు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు.
ఇతనిపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 0495/2017న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్ పూర్ స్టేషన్లో సెక్షన్ ఐపీసీ 420, 406, 467, 468, 569, 471, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. నగదు చెల్లింపు వ్యవహారంలో కేసు నమోదు. లలిత్‌పూక్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్ 4895/2017తో కేసు కొనసాగుతోంది. లతిత్‌పూర్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 0908/2017తో ఠానాలో కేసు నమోదైంది. ఇది కూడా లలిత్‌పూర్ కోర్టులో సెక్షన్ 120బీ, 420, 467, 468, 504, 471,406 తదితర సెక్షన్ల కింద నమోదై అయి విచారణ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో పోలీస్‌స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 0203/2017తో కేసు నమోదైంది. పీసీ109, 120బీ, 420 తదితర సెక్షన్ల కింద, కరప్షన్ యాక్ట్ 13(1),సీ, 13(2)బి,డీ కింద ఏసీబీ కోర్టులో కేసు కొనసాగుతోంది.
కురుగొండ్లది వివాదాస్పద వైఖరి
కాంట్రాక్టర్లను బెదిరించడం, అధికారులపై మైక్‌లు విసిరి నానా గందరగోళం చేయడం పోలీసు ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసి దూషించడం ఇదంతా వెంకటగిరి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ వివాదాస్పద వైఖరి. నెల్లూరులో అద్దెక భవనాన్ని తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేయండా దౌర్జన్యంగా ఆక్రమించి, రౌడీయిజం చేసిన ఘటనలు ఉన్నాయి. అతను అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, పార్టీలో సీనియర్ నేతగా ఉండటంతో వివాదాలు జరిగి పోలీసు స్టేషన్ వరకు వ్యవహారాలు వెళ్లినా ఎక్కడా మాత్రం కేసులు నమోదు కాని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment