వ్యాపారస్తులను బెదిరించి
రూ.లక్షలు గుంజిన వైనం
అధికారపార్టీ మద్దతుదారుడైన ఆర్‌ఎంపీ
వైద్యుడి కుమారుడి సహకారంతో దందా
రూ.75వేలు నగదు, కారు,8 సెల్‌ఫోన్లు స్వాధీనం
నక్కపల్లి/ఎస్‌రాయవరం : మావోయిస్టులమంటూ ఎస్‌రాయవరం, అడ్డురోడ్డు ప్రాంతాల్లో 15రోజులుగా పలువురు వ్యాపారస్తులను బెదిరించి రూ.లక్షలు వసూలు చేసిన ఆరుగురు సభ్యుల ముఠాను ఎలమంచిలి సీఐ కె.వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ముఠా గుట్టురట్టు చేశారు. వారి నుంచి రూ.75వేల నగదు, ఇండికా కారు, 8 సెల్‌ఫోన్లు, సీతారాముల పట్టాభిషేకంతో ఉన్న రాగినాణెం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌రాయవరానికి చెందిన టీడీపీ మద్దతుదారుడైన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి కుమారుడు,
అతని స్నేహితుడు వీరికి సహకరించారు. నాలుగురోజుల క్రితం నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టి శనివారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నర్సీపట్పం ఏఎస్పీ సత్య ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లికి చెందిన సందిపూడి మురళి అలియాస్ మణిస్వరూప్ అలియాస్ అభి, ఎత్తుల శివ, వక్కల నూకరాజు, అనంతపురానికి చెందిన బి.విష్ణువర్ధనరెడ్డి, ఎస్‌రాయవరానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు సుబ్రహ్మణ్యం కుమారుడు గిడుతూరి చక్రపాణి, లింగరాజుపాలెంకు చెందిన సన్యాసిరావులు స్నేహితులు.
చక్రపాణి బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న సమయంలో వీరితో పరిచయం పెంచుకున్నాడు. సులభంగా సంపాదనకు వీరు పథకం పన్నారు. ఇటువంటి పథకాల రూపకల్పనలో అభి దిట్ట. చక్రపాణి వివరాలు ప్రకారం అభి 15రోజులు క్రితం ఎస్.రాయవరంలోని ఓ మెడికల్‌షాపు యజమానికి ఫోన్‌చేసి తాము గణేష్ దళానికి చెందిన మావోయిస్టులమంటూ రూ.2లక్షలు డిమాండ్ చేసి రూ.1.20 లక్షలు వసూలు చేశారు. మళ్లీ వారం రోజుల్లో మరో రూ. ఇరవై వేలు డిమాండ్ చేసి తెచ్చారు. తాజాగా వారం క్రితం అడ్డురోడ్డులో ఉన్న ఆర్‌కె మెడికల్‌షాపునకు ఫోన్‌చేసి రూ.5లక్షలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే పిల్లల్ని కిడ్నాప్‌చేస్తామని, చంపేస్తామని, షాపు పేల్చేస్తామని బెదిరించారు. దీంతో షాపు యజమాని ఆనంద్ పోలీసులు ఆశ్రయించారు. ఎలమంచిలి సీఐ వెంకటరావు దీనిని నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలమేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారి సూచన మేరకు షాపు యజమాని ఆనంద్ రూ. 5లక్షలు ఇవ్వలేనని. రూ.80వేలు ఇవ్వగలనని నిందితులకు చెప్పారు. సైతారుపేట రోడ్డులోకి రమ్మని కోరారు. ఈమేరకు ముఠాలోని శివ, విష్ణువర్ధన్‌లు వచ్చారు. అక్కడ మాటువేసిన నక్కపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్,పాయకరావుపేట ఎస్‌ఐ ప్రసాద్, ఎస్‌రాయవరం ఎస్‌ఐ శ్రీనువాసరావు, రాంబిల్లి ఎస్‌ఐ మల్లేశ్వరరావు, అచ్చుతాపురం ఎస్‌ఐ అప్పలనాయుడు,ఎలమంచిలి సర్కిల్‌క్రైంటీం చెల్లారావు, గంగాధర్‌లు పథకం ప్రకారం వీరిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా ప్రధాన సూత్రధారి మణిస్వరూప్ అలియాస్ అభిపేరు చెప్పారు. వారిచ్చిన ఫోన్‌నంబర్ల ఆధారంగా అభిని నాలుగురోజుల క్రితం వేంపాడు టోల్‌గేట్ వద్ద ఇండికా కారుతో పట్టుకున్నారు. అతనిని విచారించగా తెలిపిన వివరాలు ప్రకారం ఎస్.రాయవరంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు కొడుకు చక్రపాణి, అతని స్నేహితుడు సన్యాసిరావు,ఏజెన్సీకి చెందిన ఎత్తుల శివలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. వాస్తుదోషాలు,కుటుంబ సమస్యలు పోగొడతాయంటూ పురాతన నాణేలు అమ్మేవారు. ఈ ఆరుగురిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచినట్టు ఏఎస్పీ సత్య ఏసుబాబు వివరించారు.
నకిలీ మావోయిస్టు ముఠా
Published Sun, Apr 5 2015 3:40 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement