
హమ్మయ్య!
ఊపిరి పీల్చుకున్న మన్యం
ముగ్గురు గిరిజనులనూ విడిచిపెట్టిన మావోయిస్టులు
ఫలించిన గిరిజన ఉద్యోగ సంఘాల కృషి
అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు
కిడ్నాప్ చేసిన ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు సురక్షితంగా విడుదల చేయడంతో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. దీంతో కుటుంబ సభ్యులు, మన్యం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం స్పందించకపోయినా వీరి విడుదల కోసం గిరిజన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు చేసిన విశేష కృషి ఫలించింది. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటామని విడుదలైన నాయకులు స్పష్టంచేశారు.
జీకేవీధి: ఎట్టకేలకు మావోయిస్టులు మానవతా దృక్పథంతో టీడీపీ నేతలు ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండలం బాలయ్యను బుధవారం సాయంత్రం విడుదల చేయడంతో తెల్లవారుజామున వారు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 6న జీకేవీధి మండలం కొత్తూరు గ్రామం వద్ద మావోయిస్టులు ఈ ముగ్గురినీ అపహరించిన సంగతి తెలిసిందే. వారికి ఎలాంటి హాని తలపెడతారోనని అప్పటి నుంచి కుటుంబసభ్యులు, మన్యం వాసుసలు ఆందోళనతో గడిపారు.
గిరిజన ఉద్యోగ సంఘాల కృషి ఫలితమే..
టీడీపీ నేతల విడుదలలో గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కీలకపాత్ర పోషించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అనే విప్లవ నానుడిని నిజం చేసి నిరూపించారు. మన్యంలో గిరిజన ఉద్యోగులుగా ఉంటూ అనేక సమస్యలపై పోరాడుతున్న గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తోటి గిరిజనులను మావోయిస్టులు అపహరించారన్న సంగతి తెలియగానే స్వచ్ఛందంగా స్పందించారు. చింతపల్లి, జీకేవీధి గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోతురాజు బాలయ్య, సేవా రాజారావు, ముర్ల వెంకటరమణ, గెమ్మెలి మోహన్, యువి గిరితోపాటు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్ పలు దఫాలుగా మావోయిస్టులతో సంప్రదింపుల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం అడవుల్లో అణువణువునా జల్లెడ పట్టారు. రెండు విడతలుగా వీరి ప్రయత్నాలు బెడిసి కొట్టినప్పటికీ మూడోసారి ఉపాధ్యాయ సంఘాల నేతలు అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి వారి అధీనంలో ఉన్న టీడీపీ నేతలన సురక్షితంగా తీసుకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘనత గిరిజన ఉపాధ్యాయ సంఘాలకే దక్కింది. గత నెల ఇదే ఉపాధ్యాయ సంఘ నాయకులు మావోయిస్టులను కలిశారంటూ జరిగిన ప్రచారంపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను లెక్క చేయకుండా సాటి గిరిజనుల విడుదలపై కృషి చేసిన గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల కృషిని మన్యం వాసులు అభినందిస్తున్నారు.
అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు
టీడీపీ నేతలను మావోయిస్టులు అపహరించిన వ్యవహారంలో ఆది నుంచి ఆ పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అయినప్పటికీ మావోయిస్టుల చెరలో ఉన్న నేతల విడుదలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు , ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరు కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. గాలింపులను నిలిపివేస్తామని, మావోయిస్టుల చెరలో ఉన్న వారి విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటనలు చేశారే తప్ప క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలేమీ కానరాలేదు. ఈ నేపధ్యంలోనే గిరిజన ఉపాధ్యాయ సంఘ నేతల చొరవ వల్ల టీడీపీ నేతలు మావోయిస్టుల చెర నుంచి బయపడ్డారు.