విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు అపహరించి వారం గడుస్తున్నా ప్రభుత్వం వారి విడుదలకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో.. మూడు మండలాల్లో పార్టీ కేడర్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మణికుమారి మీడియాకు తెలిపారు.
పాడేరు ఏజెన్సీ పరిధిలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు వారం క్రితం విశాఖ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కల మహేశ్ , జీకే వీధి మండల అధ్యక్షుడు ఎం బాలయ్య పడాలు, ఉపాధ్యక్షుడు వి.బాలయ్యను మావోయిస్టులు అపహరించారు. అయితే, వీరి విడుదల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పార్టీ స్థానిక నాయకులకు ఆగ్రహం కలిగించింది.
సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం విశాఖ వచ్చిన సందర్భంగా అపహరణకు గురైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను కలసి విడుదలకు కృషి చేయాలని కోరారు. అయినా, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లి, జేకే వీధి, జి.మాడుగుల మండలాలకు చెందిన నాయకులు అందరూ తమ పదవులకు రాజీనామా చేశారు.
రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తామని వారు చెప్పినట్టు మణికుమారి తెలిపారు. కాగా మరో వైపు కొయ్యూరు, పాడేరు మండలాలకు చెందిన టీడీపీ కేడర్ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.