
సాలూరు రూరల్ (విజయనగరం): ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మావోయిస్టులు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. ఏవోబీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో తెలుగులో రాసిన ఈ లేఖను ఒడిశాలోని మల్కన్‌గిరి సమీపంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రజల న్యాయమైన డిమాండ్‌ను అమలు చేయాలని, అది పెట్టుబడిదారుల హోదాను కాకుండా ప్రజల హోదాను పెంచేదిగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల లాబీయింగ్ ద్వారా కాకుండా పోరాటం తోనే హోదా సాధించుకోవాలని, దీనికి ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు ఐక్య సంఘటనగా ఏర్పడాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్) పేరుతో విడుదలైన మరోలేఖలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారని లేఖలో విమర్శించారు. హోదాకోసం ప్రజలు పోరాడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందన్న విషయం మరిచిపోవద్దంటూ హెచ్చరించారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment