ఆత్మకూరు రూరల్ (కర్నూలు జిల్లా) : పనీపాటలేని పోకిరి చేసిన ఆకతాయి చేష్టలు అటవీ అధికారులకు ముచ్చెమటలు పోసేలా చేశాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు నార్త్‌బీట్ అధికారులు గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అడవులు పట్టుకుని తిరిగేలా చేసిన సంఘటన వివరాలిలా ఉన్నాయి..
ఆత్మకూరు డిఎఫ్‌ఓ సెల్వం సెల్ ఫోన్కు గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెలుగోడు రేంజ్ పరిధిలోని నార్త్‌బీట్‌లో ఓ పులి వధించబడిందని, దాని చర్మం ఒలిచి మాంసాన్ని పాతి పెట్టారని ఆ ఫోన్‌కాల్ సారాంశం. దాంతో ఆ డివిజన్ అధికారి.. తన క్రింది స్థాయి ఉద్యోగులను యుద్ధ ప్రాతిపదికన తరలించాడు. ఫోన్‌కాల్లో చెప్పబడిన ప్రదేశమంతా జల్లెడ పట్టించాడు. డివిజన్ పరిధిలో రెండు పులుల వధ జరిగి వాటి చర్మాలు పట్టుబడిన సంఘటన ఇంకా తాజాగానే ఉండడంతో వచ్చిన సమాచారం ఏం ఉపద్రవం తెస్తుందో, ఎవరి ఉద్యోగానికి మంగళం పలుకుతుందో అర్థం కాని వెలుగోడు రేంజ్ సిబ్బంది తీవ్రమైన ఆందోళనల నడుమ అర్ధరాత్రి వరకు తమ అన్వేషణ కొనసాగించారు.
ఇంతలో ఈ సమాచారం పాత్రికేయులకు అందడంతో డిఎఫ్‌వో, వెలుగోడు రేంజ్ అధికారుల సెల్ ఫోన్‌లకు సమాచారం కోసం నిరంతరం ఫోన్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి . అయితే అలాంటిదేమీ లేదన్న సమాధానం మాటున అధికారులు తమ వెతుకులాట కొనసాగించారు. ఎట్టకేలకు వారి అన్వేషణ ఫలించింది. కాస్త రక్తపు మరకలు కలగలసిన తాజా మట్టి కుప్ప వారికి కనిపించింది. అక్కడ కచ్చితంగా ఏదో పూడ్చి పెట్టిన ఆనవాళ్ళు నిర్ధారణ అయ్యాయి. హఢావుడిగా అక్కడ తవ్వకం జరిపిన అధికారులకు వారు ఊహించిన పులి శరీర భాగాలు కాక బ్రాయిలర్ కోళ్ళ పేగులు కనపడడంతో తమను ఎవరో ఆకతాయి ఆట పట్టించారన్న విషయం అర్థమయ్యింది. అప్పటికికానీ డిఎఫ్‌ఓ మొదలు సహాయ బీట్ ఆఫీసర్ వరకు కొండంత బరువు తల పైనుంచి దిగిపోయిన భావనకు గురయ్యారు.
పులికి సంబంధించిన అంశం కాబట్టి అటవీ శాఖ అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడలేదు. తమకు దొరికిన బ్రాయిలర్ కోళ్ళ మాంస ఖండాలను స్థానిక పశు వైద్యాధికారి రాంసింగ్ వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించి శాస్త్రీయంగా నిర్ధారించుకున్న తరువాతే తమ పులి అన్వేషిత కార్యక్రమాన్ని ముగించారు.
ఆకతాయి చేష్టలకు అదిరిపోయిన అటవీశాఖ అధికారులు
Published Fri, Jul 10 2015 6:21 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement