బహు‘మతులు’ పోతున్నాయ్..!! | Fake SMS | Sakshi
Sakshi News home page

బహు‘మతులు’ పోతున్నాయ్..!!

Published Thu, May 22 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

బహు‘మతులు’ పోతున్నాయ్..!!

బహు‘మతులు’ పోతున్నాయ్..!!

రాయవరం, న్యూస్‌లైన్ :‘కంగ్రాట్స్.. మీ సెల్ నంబర్ మేము తీసిన లక్కీ డ్రాలో రూ.3.50 కోట్లు గెలుపొందింది. మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వృత్తి వివరాలు మాకు ఈ మెయిల్ చేయండి.’ ఇది ఒక సెల్‌ఫోన్ వినియోగదారుడికి వచ్చిన ఎస్‌ఎంఎస్. ‘వావ్.. మీరు కోకా-కోలా ప్రోమో ఇండియా/లండన్ నుంచి లక్ష పౌండ్లను గెల్చుకున్నారు. మీ వివరాలను ఈ మెయిల్ చేయండి.’ ఇది మరొక వినియోగదారుడికి వచ్చిన ఎస్‌ఎంఎస్. ఇలా రోజూ సెల్‌ఫోన్ వినియోగదారులకు ఏవేవో బహుమతులంటూ ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి.
 
 ఆ మాయలో పడితే అంతే..
 బహుమతుల పేరుతో వస్తున్న మెసేజ్‌లకు ఆకర్షితులైతే చేతి చమురు వదుల్చుకోవలసిందే. మనం ఫోన్ చేసినా..మెసేజ్ ఇచ్చినా.. మెయిల్ పంపినా.. వెంటనే ‘మీ బ్యాంకు ఖాతా నంబర్ తెలపండి. మీరు గెలుపొందిన సొమ్మును ఆ ఖాతాలో వేస్తాం’ అంటూ మరో మెసేజ్ వస్తుంది. అలాగే రూ. పదివేలు ప్రోసెసింగ్ చార్జీలుగా చెల్లించండంటూ మెసేజ్ పెడుతున్నారు. రూ. కోట్లు వస్తుంటే, రూ. 10వేలు ఇస్తే పోయేదేమిటని భావించి కొందరు సొమ్ము  చెల్లించి మోసపోతున్నారు. ఇలా పలువురు వినియోగదారులకు నిత్యం మెసేజ్‌లు వస్తున్నాయి. తార్కికంగా ఆలోచించే వారు ఇది మోసమని గ్రహించి ఊరుకుంటున్నారు. కొందరు మాత్రం ఏదో ఆశతో ముందుకెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న వారు బయటకు తెలిస్తే పరువు పోతుందని మిన్నకుండిపోతున్నారు.
 
 ఒకటి కాదు రెండు కాదు..
 ‘వెంకటేష్ ఎవరు? నటుడా? లేక క్రికెటరా? మీ సమాధానం పంపించి మేమిచ్చే బహుమతి అందుకోండి.’ ‘జుట్టు రాలుతోందా? కంప్యూటర్ ద్వారా తక్కువ ఖర్చుతో నయం చేసుకోండి. ఈ నంబరుకు ఫోన్ చేయండి.’ ‘మీకు మీ జీవిత భాగస్వామితో ఎంత శాతం ప్రేమానుబంధం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా రా? అయితే మీ భాగస్వామి పేరు టైపు చేసి ఈ నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయండి.’ ... ఇలా ఒకటీ రెండూ కాదు.. పలు రకాల ఎస్‌ఎంఎ స్‌లు వినియోగదారులకు వస్తున్నాయి. అలసి ఇంటికి వచ్చి భోజనం చేసేటపుడో, నిద్రకు ఉపక్రమించేటపుడో ఇవి వస్తున్నాయి. కొన్ని ఎస్‌ఎంఎస్‌లకు స్పందిస్తే సెల్ బ్యాలెన్స్ మటుమాయం అవుతోంది.  
 
 బీమా కంపెనీలూ అంతే..
 ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ‘హలో..ప్రసాద్‌గారూ ఈ రోజు 20 మంది లక్కీడీప్ విజేతలను ఎంపిక చేశాం. అందులో మీ సెల్ నంబర్ ఉంది. మీరు  రాజమండ్రి వస్తే బహుమతి పట్టుకువెళ్లవచ్చు. అంటూ బీమా కంపెనీలు మెసేజ్‌లు పంపుతున్నాయి. తెలివైన వాళ్లు మేము ఏమైనా డబ్బు  చెల్లించాలా? అని అడిగితే మేము ఒక బాండ్ ఇస్తాం. ప్రీమియం చెల్లిస్తే చాలని సమాధానం వస్తుంది. అలా అడగని అమాయకులు, నిరక్షరాస్యులు రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలకు వెళ్లి డబ్బు నష్టపోతున్నారు. ఇది బీమా పాలసీలపెంపు కోసం ఇచ్చిన మెసేజ్ అని అక్కడికి వెళ్లాకే అర్థం అవుతోంది.  మాచవరం లో ఒక కూలీకి ఇలాగే ఫోన్ రాగా రూ.వెయ్యి అప్పు చేసి రాజమండ్రి వెళ్లాడు. తీరా అక్కడ బీమా ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో ఉసూరంటూ వెనుదిరిగాడు.  
 
 మోసపోవద్దు..
 లక్షలు, కోట్లు గెలుపొందారంటూ వచ్చే బోగస్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు. ఎవరికి వారు ప్రాక్టికల్‌గా ఆలోచించుకోవాలి.  - గొలుగూరి వరలక్ష్మి, టెలికామ్ సలహా మండలి సభ్యురాలు, రాయవరం. అనవసర ఎస్‌ఎంఎస్‌లతో ఇబ్బందులు పడే వినియోగదారులు 1909 నంబరుకు డయల్ చేసి వాటిని నిలుపుదల చేసుకోవచ్చు. - ఎం.శివప్రసాద్‌రాజు, ఎస్‌డీఈ, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, రాజమండ్రి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement