పకీరు సేవ.. అల్లాహ్‌ తోవ | Fakeer Service in Ramadan Month | Sakshi
Sakshi News home page

పకీరు సేవ.. అల్లాహ్‌ తోవ

Published Sat, May 11 2019 12:50 PM | Last Updated on Sat, May 11 2019 12:50 PM

Fakeer Service in Ramadan Month - Sakshi

ముస్లింలను సహరి కోసం నిద్రలేపేందుకు డప్పు వాయిస్తున్న పకీరు సయ్యద్‌ సుభాని

అల్లాకు మనిషిని చేరువ చేసే పుణ్యదినాలుగా రంజాన్‌ మాసాన్ని ముస్లింలు భావిస్తారు. కఠిన నియమాలతో ఈ మాసంలో చేసే నమాజ్‌లు, ఉపవాస దీక్షలు రెట్టింపు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని ప్రతి ముస్లిం నమ్మకం. ఈ పుణ్య కార్యంలో పకీరుల (రఫాయిలు) పాత్రకు ప్రాధాన్యత ఉంది. అలసి సొలసిన శరీరాల మత్తు వదిలేలా.. అల్లాహ్‌ పిలుపును దరిచేర్చేలా.. ముస్లింలను సహరికి సిద్ధం చేసేందుకు తెల్లవారుజామున     పకీరుల గానం ఇళ్ల ముందుకు చేరుకుంటుంది. భక్తి గానం ఆనందడోలికల్లో ఓలలాడిస్తుంది.

లక్ష్మీపురం (గుంటూరు) : ‘ఉఠో రోజెదారో ఉఠో.. టైం దో బజ్‌ రహేహై ఉఠో.. సహరికా వక్త్‌ హోరహాహై. ఉఠో మా బహెనో ఉఠో.. జల్దీసే పకాలో.. సహెరికా ఇన్‌తెజామ్‌ కర్‌లో.. అయ్‌ మోమినో మాహె రంజాన్‌ అతా హై ప్యారా.. అల్లాహు.. అల్లాహు’ అంటూ చేతిలో డప్పు (డఫాలి)ను వాయిస్తూ బయలుదేరుతారు (పకీరులు) రిఫాయిలు. అల్లా శక్తిని, తమ భక్తిని ఖవ్వాలీ రూపంలో పాడుతూ వీధివీధి తిరుగుతారు. రాత్రి ఇషా నమాజ్‌ తర్వాత ప్రత్యేక తరవీ నమాజ్‌ చదివి ఏ 11 గంటలకో పడుకున్నా ఒంటి గంటకు నిద్రలేస్తారు. పవిత్ర రంజాన్‌ చంద్ర దర్శనం మొదలుకొని చివరి రోజా వరకు నెలంతా ప్రతి రోజు ఉపవాస దీక్షలకు సిద్ధమయ్యే ముస్లిం సోదరులను మేల్కొలుపుతారు.  రంజాన్‌ నెల ప్రత్యేకత.. రోజా (ఉపవాసం) ప్రాముఖ్యత.. నమాజ్‌ల ప్రాధాన్యం.. దానధర్మాల ప్రతిఫలం తదితర అంశాలను మధురగానం ద్వారా వినిపిస్తారు. గానానికి తగినట్లు డప్పు వాయిస్తూ ముందుకుసాగుతారు. దర్గాల వద్ద ఉంటూ పకీర్లుగా పది మంది చేసిన దానధర్మాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న వీరు రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ రహ్మత్‌ (అనుగ్రహం) నేకియా, సవాబ్‌ (పుణ్యం) పొందేందుకు ఈ పుణ్యకార్యం చేస్తుంటారు.  ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తున్న కారణంగా ఈ సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా దానధర్మాలు ఇస్తే వాటిని స్వీకరిస్తుంటారు. వీరి సేవలను గుర్తించి పలువురు నగదు, దుస్తులు, ఆహార ధాన్యాల రూపంలో ఇస్తుంటారు. వీరితో పాటు నేటి తరం యువత కూడా అల్లాహ్‌ పుణ్యం లభిస్తుందని తమదైన రీతిలో నిదురలేపుతున్నారు. రిక్షాలోనో.. సైకిల్‌పైనో.. మైక్‌ సెట్టు పెట్టుకొని వాటి ద్వారా ఖవ్వాలీ పాటలు పెట్టడం, మైకులో సహెరీ సమయం కావచ్చింది.. ఇక నిదుర నుంచి మేల్కోవాలని చెప్పడం వంటి ఎన్నో పుణ్యకార్యాలు తెల్లవారుజాముల్లో నిర్వహిస్తున్నారు.  

పోటీపడి నిద్రలేపే జమాత్‌లు..  
గానం బాగా వచ్చే కొందరు యువకులు ఒక జమాత్‌ (గ్రూప్‌గా) ఏర్పడి భక్తి గీతాలు పాడుతూ ముస్లింలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతారు. దీంతో వారిని చూసేందుకు చాలా మంది నిద్ర లేస్తున్నారు. పురుషులు ఆ జమాత్‌తో కలిసిపోయి కొన్ని క్షణాలు ఆ ఆనందపు అనుభూతిని అనుభవిస్తారు. ఆ తర్వాత మహిళలు వంటలు వండుకోవడం, పురుషులు ముఖం కడుక్కోడం వంటి దైనందిన కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు.

నిదుర లేవకపోతే ఉపవాసంవదులుకునే పరిస్థితి..  
రంజాన్‌ మాసంలో ప్రతి రోజెదార్‌కు సహరి తప్పనిసరి. అందుకోసం వంటావార్పు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమయానికి నిదురలేచి ఆ వంటలు చేసుకోలేని పక్షంలో ఉపవాసాలు ఉండడం కష్టం. ఈ కారణంగా ఉపవాసాలను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

ఐదేళ్లుగా మేల్కొలిపే సేవలో..
20 ఏళ్లపాటు రంజాన్‌ మాసంలో సహెరీకి మేల్కొలిపే పని నా తండ్రి సయ్యద్‌ మదార్‌షా చేశారు. శారదా కాలనీ ప్రాంతం నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి ముస్లిం ప్రాంతాల్లో తిరుగుతూ సహెరీ కోసం మేల్కొలుపుతూ ఉండేవారు. ఆయన స్థానాన్ని ప్రస్తుతం నేను స్వీకరించాను.  చెప్పలేని ఆత్మసంతృప్తి కలుగుతోంది. తెల్లవారుజామున దీక్షలకు సహెరీ భోజనాలు చేయడం తప్పనిసరి. వీటి ఏర్పాట్లు కోసం ప్రతి రోజు అర్ధరాత్రి నేను కూడా 2 గంటల నుంచి నిదురలేచి వంటలు చేసుకోవాలి. గతంలో గడియారాలు, అలారం వంటివి చాలా తక్కువ ఇళ్లలో ఉండేవి. అలాంటి వారి కోసం మాలాంటి వాళ్లు అర్ధరాత్రి నుంచి పట్టణంలో తిరిగి అల్లా రసూల్‌పై ఖవ్వాలీ పాటలు పాడి మేల్కొలిపేవారు. సహెరీ  కోసం మేల్కొలిపితే అల్లాహ్‌ నాకు, నా కుటుంబ సభ్యులకు పుణ్యం ప్రసాదిస్తాడనే కానీ మరొకటి ఆశించి కాదు.   
– సయ్యద్‌ సుభాని, పకీరు,  శారదా కాలనీ, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement