ఉత్తుత్తి మాటలే!
ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణ దిశగా అడుగు ముందుకు పడుతున్న సూచనలు కనిపించడంలేదు. పెపైచ్చు సిద్ధమైన విమానాశ్రయూన్ని కూడా ప్రారంభించకుండా రాజకీయ వివక్ష ప్రదర్శిస్తున్నారు. వైఎస్ హయూంలో ఐదేళ్లు మినహా దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధి విషయంలో వివక్ష కనిపిస్తూనే ఉంది. జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా నిష్ర్పయోజనమే అవుతోంది. గత ఆరు నెలల చంద్రబాబు పాలన తీరును విశ్లేషిస్తే ఇది కాదనలేని వాస్తవం.
గత ఆరు నెలల్లో వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన వరాలివి
⇒ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం విశేషంగా కృషి
⇒ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం..
⇒ పండ్ల రైతుల కోసం మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు
⇒ రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు...
⇒ చేనేతల కోసం మైలవరంలో టెక్స్‌టైల్స్ పార్క్..
⇒ ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్..
⇒ జిల్లాలో పిలిగ్రిమ్ టూరిస్టు సర్క్యూట్..
⇒ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
⇒ కడప-చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ..
⇒ ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం..
సాక్షి ప్రతినిధి,కడప: పరిశ్రమల కోసం ఎదురుచూపులు.. ఉపాధి అవకాశాలను పెంచితే ఫ్యాక్షన్‌ను లేకుండా చేయవచ్చనే లక్ష్యంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సిద్ధమయ్యారు. కడప సమీపంలో ఏపీఐసీసీ ద్వారా భూములు సేకరించి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు. 6464.5 ఎకరాలు భూమిని సిద్ధంగా ఉంచారు. ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు.
అదేబాటలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్నట్లుంది. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు, చర్యలు కన్పించాయి. ఒక్క వైఎస్సార్ జిల్లాకు మాత్రమే అలాంటి జాబితాలో చోటు దక్కడం లేదని జిల్లా వాసులు మదనపడుతున్నారు. సాగునీటి పథకాలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. సమీక్షలు మినహా ఎలాంటి పురోగతి లేకపోయింది. తుదకు వరదనీరు శ్రీశైలం జలాశయం నుంచి సముద్రం పాలైంది, అరుునా వైఎస్సార్ జిల్లాలోని జలాశయాలకు మళ్లించలేని దుస్థితిలో పాలకులు ఉండిపోయారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
అడుగడుగునా రాజకీయ వివ క్షే....
వైఎస్సార్ జిల్లా పట్ల అడుగడుగునా రాజకీయ వివక్ష కన్పిస్తోంది. తుదకు ముఖ్యమంత్రి పర్యటనలోనూ అదేధోరణి అవలంబించారన్న విమర్శలు ఉన్నారుు. ఆరునెలల కాలంలో ప్రతి జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. జిల్లాకు మాత్రం జన్మభూమి- మాఊరులో భాగంగా తప్పని పరిస్థితుల్లో ఒక్కమారు హాజరయ్యారు. రాజకీయ వివక్షలో భాగంగానే తుదకు విమానాశ్రమం సైతం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.
జిల్లా పారిశ్రామిక వృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పురోగతిని సాధించడంతో జిల్లా కేంద్రానికి విమాన సౌకర్యం అనివార్యమైంది. రిమ్స్, వైవీయూ నెలకొన్న నేపధ్యంలో ప్రముఖులు రాకపోకలు, యర్రగుంట్ల సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారులకు కూడా కడప నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారలావాదేవీల కోసం తరచూ వెళ్లేవారందరికీ కడప ఏయిర్‌పోర్టు సౌలభ్యంగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి ‘కనెక్టింగ్ ఫ్లైట్స్’ నడుస్తాయనే ఆలోచనకు దూరం చేశారనే విశ్లేషలు భావిస్తున్నారు.
గత నెల 8న రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో పర్యటించినప్పుడూ సీఎం బాబు జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటన చేసిన రోజు సైతం ఆదేరీతిలో హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో ఆదేశాలు జారీ కాలేదు. తుదకు రూ.20వేల కోట్లుతో ఉక్కు పరిశ్రమను సెయిల్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆమేరకు జిఓఎం(గ్రూప్స్ ఆప్ మినిష్టర్స్) నోట్‌లో ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయత్నం కన్పించలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆరునెలలు పాలనలో జిల్లాకు ఒరిగింది ఏమి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్వపు వివక్షత మరోమారు స్పష్టంగా కన్పిస్తోందనేది మాత్రం కాదనలేని సత్యం.