లంచగొండితనం తనను అమెరికా విమానమెక్కించినా, సొంతూరు, తెలుగు రాష్ట్రాన్ని ఆమె విస్మరించలేదు. క్యాన్సర్ రోగులకు చికిత్స కోసం హైదరాబాద్‌లో ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు వ్యవస్థాపక ట్రస్టీగా అవసరమైన నిధులు, అధునాతన యంత్ర పరికరాలను సమకూర్చారు. ఎన్నో సేవలతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. తాను కన్నుమూశాక అంత్యక్రియలు ఇక్కడే జరగాలన్న ఆమె మనోభావాన్ని ఇప్పుడా కుటుంబ సభ్యులు నెరవేర్చనున్నారు. న్యూయార్క్‌లో ఈ నెల 12వ తేదీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన డాక్టర్ పోలవరపు తులసీపార్వతి భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలింపు సన్నాహాల్లో ఉన్నారు.
సాక్షి, తెనాలి : డాక్టర్ పోలవరపు తులసీపార్వతి దుగ్గిరాల మండలంలోని కంఠంరాజుకొండూరులో 1941లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో ఊళ్లో రోడ్డే కాదు, బడి కూడా లేదు. బిడ్డను చదివించాలన్న కోర్కెతో ఆమె తండ్రి ఇంట్లోనే టీచరును పెట్టారు. 8వ తరగతికి 3 కి.మీ. దూరంలోని దుగ్గిరాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకు న్నారు. కొండపల్లిలోని మేనత్త ఇంట్లో ఉండి 10వ తరగతి పూర్తిచేసింది. గుంటూరు మహి ళా కళాశాలలో ఇంటర్ ఉత్తీర్ణురాలయ్యాక, మెరిట్‌లో అదే నగరంలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేరారు. అప్పట్లో ఆ కాలేజీలో కొత్తగా వచ్చిన ఎండీ కోర్సులోని రెండు సీట్లలో ఒకటి తనకు లభించింది. 1966లో గైనకాలజీలో ఎండీగా బయటకొచ్చారు.
లంచమడిగారని తిక్కరేగి అమెరికాకు..
అమెరికా వెళ్దామని స్నేహితులు సూచించినా, సొంతూరులో ఆస్పత్రిని స్థాపించాలన్న ఉద్దేశంతో తులసీపార్వతి అంగీకరించలేదు. కొద్దికాలం ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసినా, కొన్ని కారణాలతో అమెరికాకు పయనమయ్యారు. ఈవిషయమై సన్నిహితులు అడిగినపుడు, ‘గుంటూరు లేదా తెనాలి బదిలీ చేయమని కోరితే దిగువ సిబ్బంది లంచంగా అడగటంతో తిక్కరేగింది.. అమెరికాకు ప్రయాణం కట్టా’నని తులసీపార్వతి చెప్పేవారు. ఆ విధంగా 1972 జూలైలో తాను అమెరికాకు బయలుదేరిన విమానంలోనే ఇరవై మంది తెలుగు డాక్టర్లు ఉన్నారని చెబుతుండేవారు. 1978 నుంచి ప్రాక్టీస్ ఆరంభించారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ హాస్పటల్‌లో డాక్టర్ తులసీపార్వతి సీనియర్ గైనకాలజిస్ట్ కాగా, తన భర్త డాక్టర్ పోలవరపు రాఘవరావు ఆర్థోపెడిక్. కుమార్తె శైలజ కూడా గైనకాలజిస్టే. కొడుకు హరికిషన్ ఎండీ ఫిజీషియన్. ఆ ఇంట్లో నలుగురూ వైద్యులే.
‘కార్పొరేట్’ స్థాయి ఉన్నత పాఠశాల..
చిన్నతనంలో చదువుకు పడిన కష్టాలను గుర్తుచేసుకుని, గ్రామంలో మరెవరికీ ఆ కష్టాలు ఉండరాదని తలచారు. తలిదండ్రుల పేర్లతో కారుమంచి రత్తమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి, కంఠంరాజుకొండూరులో ‘కారుమంచి గోవిందయ్య ఉన్నత పాఠశాల’ను 1992లో ప్రారంభించారు. ఇక్కడ ఇప్పుడు ఏటా 400–450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ చదివినవారు విదేశాల్లో, ఇతర చోట్ల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment