
భార్య, పిల్లలతో నందకుమార్
చిత్తూరు రూరల్ : ప్రార్థించే పెదాల కన్న సాయం చేసే చేతులు మిన్న అంటారు... అలాంటి చేతుల కోసం చేతులెత్తి ప్రాధేయపడుతోంది ఓ కుటుంబం. రెండేళ్లుగా మంచానపడ్డ అభాగ్యుడి వైద్యఖర్చులు ఆ కుటుంబానికి భారమవుతున్నాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని అభ్యర్థిస్తోంది ఆ కుటుంబం.చిత్తూరు నగరం సాంబయ్యకండ్రిగకు చెందిన నందకుమార్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. 2017లో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. చివరకు వెన్నుపూసలోని నరాలు తెగినట్లు వైద్యులు నిర్థారించారు. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో నందకుమార్‌కు ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నడవలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఇతనికి తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు మగపిల్లలుకాగా, ఒకరు ఆరో తరగతి, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. మరో అమ్మాయి వయస్సు మూడేళ్లు.
భవిష్యత్‌పై మానసిక క్షోభ
కుటుంబ యజమాని మంచమెక్కడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వైద్య ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. చేసేది లేక భార్య సుగంతి కూలికి వెళ్తోంది. భర్తకు కావాల్సిన మందులు, మాత్రల ఖర్చులు, కుటుంబపోషణ ఆమెకు కష్టంగా మారింది. ఈ క్రమంలో అప్పులు కూడా చేయాల్సి వస్తోంది. తల్లి వృద్ధాప్యంలో ఉండడం, భార్య కష్టపడడం, తాను మంచానికే పరిమితమయ్యాననే బాధలు అతన్ని కుంగదీస్తున్నాయి. చిన్న వయస్సులో ఉన్న పిల్లల భవిష్యత్ ఎలా అనే మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు.
దాతల సాయం కోసం అభ్యర్థన
ఏ ఆధారం లేని నందకుమార్ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. నెలకు మందులు, మాత్రలకు రూ. 3 వేలు చొప్పున ఖర్చవుతోంది. శరీర భాగంలో అక్కడక్కడ పుండ్లు ఏర్పడడంతో మూడు రోజుల క్రితం తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వైద్యం చేయలేమని, రోజుకు బెడ్ చార్జి రూ. 2.500 కడితే చికిత్స చేస్తామని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో నందకుమార్ కుటుంబసభ్యులు వెనుదిరిగారు. చలించే హృదయాలు ముందుకొచ్చి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు. దాతలు 8977038535 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నా భర్తను ఆదుకోండి
నా భర్త రెండేళ్లుగా మంచం మీదే ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాం. ప్రతి నెలా చిత్తూరు నుంచి తిరుపతిలోని ఆస్పత్రికి రానుపోను ఛార్జీలకు రూ.2 వేలు, మందులు మాత్రలకు రూ. 3 వేలు ఖర్చవుతోంది. ఇప్పుడు డాక్టర్లు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోమంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స చేయలేమంటున్నారు. బెడ్ చార్జి రూ. 2,500 కడితే ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామన్నారు. చేతిలో డబ్బులు లేక వచ్చేశాం. ప్రస్తుతం బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ప్రతి నెలా బాడుగ కట్టాలి, కుటుంబఖర్చులు చూడాలి, భర్తకు మాత్రలు.. మందులు కొని ఇవ్వాలి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. దయగల దాతాలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. – సుగంతి
Comments
Please login to add a commentAdd a comment